వచ్చే వారం తెలంగాణ రాష్ట్ర సమితిని .. భారత రాష్ట్ర సమితిగా మార్చే ప్రక్రియను ఢిల్లీలో ప్రారఁభించబోతున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఈ ప్రకటన చేయబోతున్నారు. ఆ సమయంలోనే ఆయన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కనీసం సగం రాష్ట్రాలకు అయినా ఇంచార్జులను ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆయన వెంట వచ్చే వారు ఎవరు అన్నది మాత్రం స్పష్టం కావడం లేదు. కొద్ది రోజులుగా కేసీఆర్ దేశ్ కీ నేత అని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. మీడియాకు పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు.
అంతర్గతంగా కూడా కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహించారని.. ఆయా రాష్ట్రాల్లో ప్రజలపై ప్రభావం చూపగల… ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని వారిని గుర్తించి.. బీజేపీకి వ్యతిరేకంగా వాదన వినిపించగలిగే వాళ్లను రెడీ చేసుకున్నారని అంటున్నారు. వారికి జాతీయ స్థాయి గుర్తింపు ఉండకపోవచ్చు కానీ ఆయా రాష్ట్రాల్లో గుర్తంపు ఉంటుందని.. బీఆర్ఎస్ను వారు ప్రజల్లోకి తీసుకెళ్లగలరని భావిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ స్పష్టతతోనే ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీకి ఉండవల్లి, కర్ణాటకకు ప్రకాష్ రాజ్, తమిళనాడుకు విజయ్‌లను ఇంచార్జులుగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నా.. అది నిజం కాదని తెలుస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయాల నుంచి రిటైరయ్యానని ప్రకటించేశారు. ప్రకాష్ రాజ్ ఇలా పార్టీ బాధ్యతల్ని తీసుకుంటారా లేదా అన్నది స్పష్టత లేదు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇక విజయ్ ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. పెట్టినా ఆయన కేసీఆర్ నీడలో నడుస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఈ క్రమంలో వారు మాత్రం కాదని.. వారి ప్లేస్‌లో కొత్త వారు ఉంటారని భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో సక్సెస్ కావాలంటే కేసీఆర్ మొదటగా రాష్ట్రాల ఇంచార్జులుగా కాస్త బలమైన వ్యక్తులను నియమించగలగలగాలి. ఆ విషయంలో సక్సెస్ అయితే.. మొదటి అడుగు బలంగా పడినట్లేనని భావిస్తున్నారు.