కాపులను బీసీల్లో చేర్చాలనే తీవ్రమైన డిమాండ్‌తో ఒక గర్జన, ఒక ఆమరణ దీక్ష నిర్వహించిన ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు శాంతించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గడువు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇంతకూ ఈ గర్జన మరియు దీక్ష ద్వారా ఇంతకూ ఆయన ఏం సాధించారు. గర్జన కంటె ముందు- దీక్ష విరమణ తర్వాత.. ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఎలాంటి తేడా ఉంది. ఏ తేడాను ప్రత్యేకించి ముద్రగడ సాధించగలిగారు? ఈ కోణంలో విశ్లేషించుకోవడం అవసరం.
నిజానికి ముద్రగడ తన దీక్ష ద్వారా, కొత్తగా సాధించింది ఏమీ లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కొక్కటిగా పరిశీలిస్తే…
మంజునాధ కమిషన్‌కు 9 నెలల గడువు విధించి ఆలోగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబునాయుడు తొలినుంచి చెబుతూనే వస్తున్నారు. అయితే కేవలం మూడు నెలల వ్యవధిలోనే మొత్తం పూర్తిచేసి నివేదిక తెప్పించాలనే డిమాండ్‌తో ముద్రగడ నిరాహార దీక్ష మొదలైంది. అయితే ఇప్పుడు 7 నెలల 20రోజుల గడువులోగా నివేదిక ఇచ్చేలా ప్రభుత్వ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు ముద్రగడ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే.. ముద్రగడ నాలుగు రోజుల దీక్ష ద్వారా కేవలం నలభైరోజుల ముందుకు గడువును లాక్కువచ్చారన్నమాట.
అలాగే చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు ప్రకటించిన 5వేల కోట్లరూపాయల నిధులను ఈ రెండేళ్లకు రెండు వేల కోట్లు తక్షణం ఇవ్వాలంటూ ముద్రగడ డిమాండ్‌చేసిన సంగతి తెలిసిందే. విరమణ సమయానికి అది కూడా తుస్సుమంది. ‘ఆల్రెడీ వంద కోట్లు విడుదల చేశారు. ఈ ఏడాది బడ్జట్లో పెట్టి మరో 500 కోట్లు మాత్రం ఇస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్‌నుంచి ఏడాదికి వెయ్యికోట్ల వంతున ఇస్తారు’ అనే పాయింటు వద్ద ఫైనలైజ్ అయింది. ఇందులో కూడా ముద్రగడ చాలా దారుణంగా చాలా మెట్లు దిగి రాజీపడిపోయినట్లుగా కనిపిస్తోంది.
ఇకపోతే కాపు కార్పొరేషన్లో ముద్రగడ సూచించిన ఒక వ్యక్తికి చోటు కల్పించడం అనేదొక్కటే మిగిలింది. అందులో పెద్ద విశేషమేమీ లేదు. అది ముద్రగడ ఇష్టులకు పదవులు కట్టబెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప జాతికి మేలు చేసే డీల్ కాదు. పైగా ఆ సమయం వచ్చినప్పుడు ముద్రగడ మీద తెదేపా మంత్రులు, దూతలు మళ్లీ ఒత్తిడి తెచ్చి.. తెదేపా అనుకూల వ్యక్తినే ఆయన సిఫారసు చేసేలా ప్రభావితం చేయగలరని అనుకోవచ్చు. ఆరకంగానూ ముద్రగడ సాధించింది ఏమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలా.. ముద్రగడ అడిగిన డిమాండ్లు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పోల్చిచూసుకుని గమనిస్తూ పోతే.. ముద్రగడ సాధించింది అంటూ ఏమీ లేనేలేదని… ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ వారి బుట్టలో పడ్డారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ”వయసు అయిపోయింది .. దీక్షలు చేయలేను” అంటూ దీనంగా పలుకుతున్న ముద్రగడ.. భవిష్యత్తులో బాబు మాటతప్పితే ఏం చేస్తారో చూడాలి.