టాలీవుడ్ లో `మా` ఎన్నికల హడావుడి మొదలైంది. ఈసారి… పోటీ కాస్త గట్టిగానే ఉండబోతోంది. ఓ వైపు ప్రకాష్ రాజ్, మరో వైపు మంచు విష్ణు ఢీ కొట్టబోతున్నారు. వీళ్ల మధ్యలో శివాజీ రాజా `నేను సైతం` అంటున్నాడు. శివాజీ రాజాకు `మా`లో కాస్త పట్టు వుంది. గత ఎన్నికలలో శివాజీ ఓడిపోయాడు. ఆ సానుభూతి తనకు బాగా పనిచేయబోతోంది. అంతకు ముందు… పించన్లు ఇప్పించడంలోనూ, `మా` సభ్యులకు సహాయ సహకారాలు అందించే విషయంలోనూ శివాజీ రాజా బాగా కష్టపడ్డాడు. అవన్నీ ఇప్పుడు తనకు కలసిరావొచ్చు.
అయితే… అటు ప్రకాష్‌రాజ్‌కీ, ఇటు మంచు విష్ణుకి సామాజిక, రాజకీయ వర్గాల అండ దండ ఉన్నాయి. కాబట్టి.. పోటీ వీళ్లిద్దరి మధ్యే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కు చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. చిరంజీవి నుంచి మాట తీసుకున్న తరవాతే.. ప్రకాష్ రాజ్ తన నిర్ణయాన్ని ప్రకటించాడని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ది ముందు నుంచీ మెగా కాంపౌండే. కాబట్టి.. చిరు తన సహాయ సహకారాలు ప్రకాష్ రాజ్‌కి అందిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే… మంచు ఫ్యామిలీకీ – మెగా ఫ్యామిలీకీ అవినాభావ సంబంధం ఉంది. ఈమధ్య అయితే.. రెండు కుటుంబాలూ మరింత క్లోజ్ అయ్యాయి. మోహన్ బాబు ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, చిరు హాజరు, ఆశీస్సులు తప్పనిసరి. చిరు పుట్టిన రోజుకి మోహన్ బాబు చెక్కతో చేసిన ఓ బైక్ ని బహుమతిగా అందించాడు. ఈమధ్య విడుదలైన `సన్ ఆఫ్ ఇండియా` టీజర్ కి చిరు తన వాయిస్ ఓవర్ అందించాడు. చిరుని సంప్రదించకుండా మోహన్ బాబు విష్ణుని బరిలో నిలిపాడంటే నమ్మలేం. మరోవైపు శివాజీరాజా కూడా మెగా కాంపౌండే. `అన్నయ్య.. అన్నయ్య` అంటూ చిరు నామ జపం చేస్తుంటాడు. చిరుని పొగడ్తలతో ముంచేయనిదే..శివాజీ రాజా ఇంటర్వ్యూ పూర్తి కాదన్నది మీడియా ఎరిగిన సత్యం.
`మా` ఎన్నికలు ఎప్పుడు జరిగినా – ఏదో ఓ వర్గానికి చిరు తన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈసారి చిరు మద్దతు ఎవరికి? అనేది చాలా ఆసక్తికరంగా మారింది. శివాజీ రాజాని ఒప్పించి చిరు.. తనని ఈ పోటీ నుంచి తప్పించే అవకాశం ఉంది. కానీ… ఇటు ప్రకాష్ రాజ్ కీ గానీ, అటు విష్ణుకి గానీ తన అభయ హస్తం అందించాలి. ఎవరికి సపోర్ట్ ఇచ్చినా, మరో వర్గాన్ని నొప్పించాలి.
* ఏక గ్రీవాం.. మరిచారా?
`మా`లో ఓ సంప్రదాయం ఉండేది. అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏకగ్రీవంగా ఉండాలన్నది సంప్రదాయం. దాసరి ఉన్నప్పుడు, ఆయన మాట చెల్లుబాటు అయినప్పుడు మా ఎన్నికలు ఏకగ్రీవంగానే సాగాయి. రెండు దఫాలుగా మాత్రం పీఠం కొసం పోటీ ఏర్పడింది. `మా` ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడే.. చిత్రసీమకు చెందిన పెద్దలంతా కూర్చుని ఓ సానుకూల వాతావరణంలో చర్చించుకుని, అధ్యక్షుడిని ఎంచుకోవడం జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే `మా` రెండు వర్గాలుగా విడిపోయింది. ఎన్నికలు అయిపోయి, అధ్యక్ష పీఠం ఏదో ఓ వర్గానికి దక్కినా.. ఆ వర్గ పోరాటం మాత్రం ఆగకపోవడం వల్ల.. `మా` పనితీరు అభాసుపాలు అవుతోంది. అందుకే… ఇప్పుడైనా పెద్దలు పూనుకోవాలి. ఏకగ్రీవాల వైపుగా ఆలోచించాలి. అప్పుడే `మా` లో రాజకీయాలు, రగడ… తగ్గుతాయి.