తెలంగాణ పీసీసీ అద్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో టీపీసీసీ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడు మరింత పెంచాలని భావిస్తోన్న హైకమాండ్… తెలంగాణలో పార్టీకి కొత్త అద్యక్షుడిని నియమించాలని భావిస్తోంది.
సీడబ్ల్యూసీ సమావేశాలు ఉండటంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్ళిన ఆయన పీసీసీ అద్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించనున్నారు. అయితే, పీసీసీ కోసం పలువురు సీనియర్ నేతలు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ సీఎంగా కొనసాగుతుండటంతో బీసీ నేతకే పీసీసీ దక్కుతుందని ఆ సామాజిక వర్గం నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధానంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీలు పీసీసీ కోసం పోటీ పడుతుండగా…తన పేరును సైతం పరిశీలించాలని సీనియర్ నేత జగ్గారెడ్డి కోరుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ తనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఇలా నేతలు ఎవరికి వారు పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అధిష్టానం వద్ద రేవంత్ ఎవరి పేరును సిఫార్స్ చేయనున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రేవంత్ ప్రతిపాదించిన నేతకే పీసీసీ అద్యక్షుడి బాధ్యతలను అప్పగిస్తారని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది కాలంగా పీసీసీ అద్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ కు సీడబ్ల్యూసీ సమావేశాల అనంతరం అధిష్టానం చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. చూడాలి అధికార పార్టీ అద్యక్షుడిగా అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందో..