జనసేన పార్టీ ప్రభావాన్ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేమని.. ఆ పార్టీకి కనీసం పది శాతం ఓట్లు వస్తాయని… ఏపీలో పరిస్థితిపై కనీస అవగాహనతో చేసిన అన్ని సర్వేల్లోనూ వెల్లడయింది. టీడీపీ, వైసీపీ ఓట్ల శాతం తగ్గి.. ఆ మేరకు ఓట్లు.. జనసేనకు వెళ్లబోతున్నాయి. అయితే.. ఎక్కువ ఓట్లు ఏ పార్టీవి జనసేన చీల్చుకోబోతోందన్నదే ఆసక్తికరంగా మారింది.
యువత ఓటింగ్ పవన్‌కు పడినట్లే….!
టీడీపీ, వైసీపీ ఓట్ల శాతం తగ్గుతుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పేశాయ్. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం మూడు శాతం మాత్రమే ఉంటుందంటూ.. లగడపాటి ప్రకటించారు. పెరిగిన పోలింగ్‌లో ఎవరి షేర్ ఎంత అన్న చర్చ ఇప్పుడు రెండు పార్టీల నేతల్లో వినిపిస్తోంది. యువత ఓటర్లను జనసేన ఎక్కువగా ఆకర్షించిందని రాజకీయాల్లో వర్గాల్లో వినిపిస్తోంది. అటు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి.. పురుష ఓటర్లలో చాలామంది గ్లాస్ పార్టీ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. 30 ఏళ్ల లోపు వయసున్న ఓటర్లు… జనసేనకు సై అంటే.. ఆ క్రాస్ ఓటింగ్ ప్రభావం ఏ పార్టీ మీద పడబోతోందన్న చర్చ జరుగుతోంది.
పురుష ఓటర్లు కూడా.. పవన్ వైపు మొగ్గారు..!
30 ఏళ్ల లోపు వయసున్న ఓటర్లను.. పవన్ పార్టీ తమ వైపు లాక్కుంటే.. దాని వల్ల నష్టం వైసీపీకే అన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే వైసీపీ ఓటు బ్యాంక్‌కు భారీగా గండి పడడం ఖాయమంటున్నారు. పురుష ఓటర్ల విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉంది. టీడీపీకి మహిళా ఓటు బ్యాంక్ ప్రధాన బలం. పురుష ఓటర్లలో సగానికి పైగా వైసీపీకి మొగ్గుతారని.. ఇలాంటి సందర్భంలో ఎక్కువ మంది జనసేనకు మొగ్గు చూపితే.. ఆ ప్రభావం వైసీపీ ఓటు బ్యాంకు మీద పడడం ఖాయం అన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఓటింగ్ 10 శాతానికి మించితే టీడీపీకి దెబ్బ.. !
10 శాతానికి మించి జనసేనకు ఓటింగ్ నమోదైన నియోజకవర్గాల్లో.. ప్రభావం ఏ పార్టీ మీద ఉండబోతుందా అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన భారీగా 20 శాతానికిపైగా ఓటు బ్యాంక్ పొందితే.. ఆ ప్రభావం టీడీపీ మీద పడే అవకాశం ఉందని.. ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. అలా జరగని ప్రాంతాల్లో మాత్రం.. గాజు గ్లాస్ దెబ్బ.. వైసీపీకే పడడం ఖాయమంటున్నారు. అటు టీడీపీకి పడగా.. జగన్‌కు మళ్లే కాపు ఓట్లను పవన్ పార్టీ చీల్చిందనే విశ్లేషణలు కూడా నియోజకవర్గాల స్థాయిలో ఉన్నాయి.