అట్లీతో ఓ సినిమా చేయాలని అల్లు అర్జున్ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. అట్లీ కూడా బన్నీ పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరి మధ్యా కథా చర్చలు కూడా జరిగాయి. కానీ `పుష్ప` రెండు భాగాలు అవ్వడం వల్ల… ఈ కాంబో ఆలస్యమైంది.
జవాన్ హిట్టయితే.. అట్లీతో సినిమా ఫిక్సయిపోవాలని బన్నీ డిసైడ్ అయ్యాడు. అందుకే జవాన్ రిజల్ట్ కోసం ఎదురు చూశాడు. జవాన్ వచ్చింది. అనుకొన్నట్టే హిట్ టాక్ సంపాదించింది. అయినా బన్నీలో ఓ డైలామా ఉండనే ఉంటుంది. ఎందుకంటే… జవాన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమానే. పాత సినిమాలన్నీ మిక్సీలో వేసి తీసిన ఐటెమ్ ఇది. బాలీవుడ్ జనాలకు ఈ తరహా సౌత్ మసాలా సినిమాలు కొత్త. షారుఖ్ ఇలాంటి కథలో కనిపించడం అక్కడ వెరైటీ. కానీ ఇక్కడ కాదు. ఎలివేషన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేయడం.. ఇవన్నీ జవాన్‌కి కలిసొచ్చాయి. అయితే వాటిని నమ్ముకొనే సినిమా తీయడానికి బన్నీ సిద్దంగా లేడు. ఎందుకంటే పుష్పతో తనపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకోవాలంటే కథలోనూ సత్తా ఉండాల్సిందే. రెగ్యులర్ కథలతో ప్రతీసారీ మ్యాజిక్ చేయలేరు. అందుకే అట్లీని నమ్మాలా, వద్దా? అనే మీమాంశలో బన్నీ ఉండడం సహజం. బన్నీ వద్దన్నా.. అట్లీకి పోయేదేం ఉండదు. ఎందుకంటే.. జవాన్ హిట్ తో బాలీవుడ్ హీరోల దృష్టి తనపై తప్పకుండా పడుతుంది. సౌత్‌లో కాకపోయినా… నార్త్ లో స్టార్ ని పట్టి, అక్కడ సినిమా చేసేయ్యగలడు. కాకపోతే… బన్నీని మెస్మరైజ్ చేసే కథతో వస్తే గనుక.. అట్లీ పని మరింత సులభమైపోతుంది. ఛాయిస్.. అట్లీదే.