ఏ సినిమాకైనా ప్రమోషన్లు చాలా కీలకం. చిన్న సినిమాలకు మరీనీ. అందులో స్టార్లు ఉండరు. ఉన్న ఒకరిద్దరితో ప్రమోషన్లు చేయించుకోవాలన్నది ఆశ. అలా అనుకుని సినిమాలు తీసే నిర్మాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు కొందరు. అనసూయదీ అదే కేటరిగీ అనిపిస్తోంది.
అనసూయ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం `దర్జా`. ఈ సినిమాలో అనసూయనే స్పెషల్ అట్రాక్షన్. సినిమా అంతా ఆమెపైనే నడుస్తుంది. ఆమెని నమ్మే.. నిర్మాతలు డబ్బులు పెట్టారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్లలో అనసూయ కనిపించడం లేదు. అనసూయని చూసి జనాలు థియేటర్లకు వస్తారని భావించిన నిర్మాత, ఆమెపై భారీగా ప్రమోషన్లు ప్లాన్ చేశాడు. కానీ అనసూయ నుంచి ఎలాంటి స్పందన, సహకారం లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి సైతం.. అనసూయ డుమ్మా కొట్టింది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది. అనసూయతో ప్రమోషన్లు చేయించుకుని బజ్ తీసుకొద్దాం అనుకున్న నిర్మాత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అనసూయ ప్రమోషన్లలో యాక్టీవ్‌గానే ఉంటుంది. `పుష్ఫ `లో చిన్న పాత్ర చేసినా.. ప్రమోషన్లలో పాల్గొంది. నిజానికి పుష్ఫ లాంటి సినిమాలకు అనసూయ అవసరం లేదు. బన్నీ స్టార్ ఇమేజ్ తో నడిచిపోతుంది. ఇలాంటి చిన్న సినిమాలకే కదా అనసూయ సహకారం కావాలి? కానీ… ఈ భామ కనికరించడం లేదెందుకో?