“కియా” క్రెడిట్ ఎవరికి..?..
ఇప్పుడిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే… కొరియా కార్ల దిగ్గజం… రూ. పది వేల కోట్లకుపైగా పెట్టుబడితో.. ఏడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పెట్టడం.. శరవేగంగా… ప్రయోగాత్మక ఉత్పత్తిని ప్రారంభించడంతో… ఈ విషయం హైలెట్ అవుతోంది. “వోక్స్ వ్యాగన్ ” కోసం తాను ఎంత కష్టపడ్డానో.. చంద్రబాబు చెబుతూ.. ఇప్పుడు “కియా” విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఎంత ప్రణాళికా బద్ధంగా వ్యవహరించానో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఇక టీడీపీ నేతలు చేసుకునే ప్రచారం ఓ రేంజ్లో ఉంది. అయితే… ఇప్పటి వరకూ.. “కియా” విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న బీజేపీ, వైసీపీలు… ప్రయోగాత్మక కారు ఉత్పత్తి అయిందన్న ప్రచారంతో.. ఒక్క సారిగా జూలు విదిల్చారు. క్రెడిట్ మోడీనే అంటూ.. ప్రచారం ప్రారంభించారు.
“కియా” కోసం మోడీ ఒప్పందం చేసుకున్నారా..?
కియా ప్లాంట్ ఏపీకి రావడంలో…చంద్రబాబు పాత్రమీ లేదని.. అంతా మోడీనే చేశారంటూ.. సాక్షి పత్రికలో ఈ రోజు ఓ కథనం ప్రచురించింది. దానికో.. కొరియా అధ్యక్షుడితో మోడీ దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సాక్ష్యంగా చూపించారు. నిజానికి కియా పరిశ్రమ మోడీ కొరియా పర్యటన వల్ల వస్తే… మోడీతో… కియా ఒప్పందం చేసుకుంటే.. అది కేంద్ర ప్రభుత్వం కృషి మేరకు వచ్చినట్లయ్యేది. వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకునేది. కానీ.. కియా ప్లాంట్ పెట్టిన తర్వాత ఇంత వరకూ.. ఒక్క సారంటే.. ఒక్క సారి కూడా కేంద్ర ప్రమేయం ఉన్నట్లు కనిపించలేదుగా..! ఆ ప్లాంట్ పెట్టడానికి.. అనువుగా… భూమిని సేకరించి.. వారికి అందించి.. మౌలిక సదుపాయాలు కల్పించడంలో.. కేంద్రం ఏమైనా సాయం చేసిందా..? అంటే.. ఐదు పైసలు సాయం కాదు కదా.. కనీసం వాకబు కూడా చేయలేదు. అయినప్పటికీ.. బీజేపీ నేతలు.. మేకిన్ ఇండియాలో భాగంగా వచ్చిందంటూ ప్రచారం చేసేస్తున్నారు. నిజంగా మోడీ ప్రమేయం ఉంటే… ఆయన అనంతపురంలో వాలిపోయి ఉండేవారు కాదా..! ఓ సెల్ ఫోన్ల కంపెనీ… తన సామర్థ్యాన్ని విస్తరిస్తేనే దాని ప్రారంభోత్సవానికి వెళ్లి … గొప్పలు చెప్పుకున్న బాపతే కదా.. మోడీ..!. కియా రాకలో.. ఏపీ ప్రభుత్వానికే పూర్తి క్రెడిట్.. కానీ.. బీజేపీ.. దాని రహస్య మిత్రుడు..వైసీపీ మాత్రం కిరీటం… మోడీకి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
గుజరాత్‌కో , మహారాష్ట్రకో తరలించాలనుకున్నది ఎవరు..?
నిజానికి కియా పరిశ్రమ కేంద్రంతో ఒప్పందం చేసుకోలేదు. ఏపీ ప్రభుత్వంతోనే ఎంవోయూ చేసుకుంది. కియా కోసం.. ఏపీ అధికారులు పడిన శ్రమను.. ఇప్పటికీ అధికారవర్గాలు గొప్పగా చెబుతూ ఉంటాయి. ప్లాంట్ ఏపీకి వచ్చేసిందనుకున్న దశలో.. గుజరాత్‌కో.. మహారాష్ట్రకో తరలించడానికి జరిగిన ప్రయత్నాలూ.. ఏపీ అధికారులకు తెలుసు. అయినప్పటికీ.. వారు తమ కృషి తాము చేశారు. ఎలా అయితేనేం కార్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ చేరింది. దీన్ని కూడా అంగీకరించడానికి జగన్మోహన్ రెడ్డి సాక్షి సిద్దంగా లేదు. ప్లాంట్‌కు దూరంగా.. ఓ కాలువను హైలెట్ చేస్తూ ఫోటో తీసి.. ఇంకా పనులు జరుగుతున్నాయని… ప్లాంట్ పూర్తి కాలేదని… ఫోటో రైటప్ రాసుకొచ్చింది. కార్ల పూర్తిగా ఇంకా ఏడాది పడుతుందని… తీర్పిచ్చింది. నిజానికి ప్రయోగాత్మక ఉత్పత్తే చేస్తున్నామని… ఆగస్టులో.. తొలి కారు వస్తుందని.. కియా ఎప్పుడో చెప్పింది. దాన్ని కూడా.. వివాదాస్పదం చేస్తున్నారు .. వైసీపీ, బీజేపీ నేతలు.
వైసీపీ, బీజేపీ కలసి మోడీకి ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వాలనుకుంటున్నాయి..?
మేకిన్ ఇండియాతో.. దేశానికి మోడీ తెచ్చిన పెట్టుబడులేమిటో.. కేంద్రం ఇంత వరకూ ఎందుకు బహిర్గతం చేయడం లేదు..? మోడీ తిరిగిన విదేశీ పర్యటనల వల్ల.. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఎందుకు చెప్పడం లేదు..?. మోడీనే కియా ఏపీకి తెచ్చినట్లయితే… కనీసం ప్రారంభోత్సవానికి కూడా మోడీని ఆకంపెనీ ఎందుకు ఆహ్వానించలేదు..?. ఇలాంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానాలు వెదికితే… ఏపీలో జరుగుతున్న రాజకీయం ఏమిటో అర్థమైపోతుంది. వాళ్లొస్తే.. వోక్స్ వ్యాగన్లు కూడా… పరారవుతాయి. కానీ చంద్రబాబు వస్తే.. కియా లాంటి పరిశ్రమలు కూడా తరలి వస్తాయి.