ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్ని ఈసీ ఎలా నిర్వహించిందో, ఎన్ని విమర్శలు పాలౌతోందో చూస్తున్నాం. అయితే, ఇదేదో ఏపీకి మాత్రమే పరిమితమైన అంశంగా, ఓటమి భయానికి చంద్రబాబు నాయుడు వెతుకుతున్న సాకుగా మాత్రమే వైకాపా చూస్తోంది. కానీ, ఎన్నికల సంఘం పనితీరును సాక్షాత్తూ సుప్రీం కోర్టు తప్పబట్టి, అక్షింతలు వేసింది. మీ అధికారాలేంటో మీకు తెలుసా అని సూటిగా ప్రశ్నించింది. సరే, ఇది ఏపీకి సంబంధించిన ఎన్నికల నిర్వహణ తీరుపై సుప్రీం వ్యక్తం చేసిన ఆగ్రహం కాకపోవచ్చు. కానీ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం ఎంత అధ్వాన్నంగా పనితీరు ఉందనేది చెప్పడానికి ఇది చాలు. ఏపీలో జరిగిన ఎన్నికలు ఒక్కటే కాదు… ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈసీ పనితీరు ఏంటో ఎవరికైనా అర్థమౌతుంది.
ఫామ్-17 పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తు దాఖలైన విషయం బయటపడితే ఈసీ ఏం చెప్పింది… మేం వాటిని నిర్ధారించుకున్నాం, వాటిలో బోగస్ అప్లికేషన్లే ఎక్కువనీ, అయినాసరే వెంటనే కఠినమైన చర్యలు తీసేసుకుంటామని అప్పుడు ప్రకటించింది. కానీ, ఆ కఠిన చర్యలు ఎప్పుడు ఉంటాయో వారికే తెలియని పరిస్థితి..? ఈలోగా ఎన్నికలు కూడా జరిగిపోయాయి. ఇంకే చర్యలు తీసుకుంటారు..? ఇక, తెలంగాణ విషయానికొస్తే… దాదాపు పాతిక లక్షల ఓట్లను జాబితాలోంచి తీసేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కోర్టులకు వెళ్లి ఈసీ వినిపించిన వాదన ఏంటంటే… ఓటర్ల జాబితాలన్నీ సక్రమంగానే ఉన్నాయన్నారు. కానీ, ఎన్నికల్లో ఏమైంది… జాబితాలో పేరులేనివారు లక్షల్లో ఉన్నారు. కోర్టు ముందు అంతా బాగుందని చెప్పిన ఈసీ… ఆ తరువాత, తప్పు జరిగింది క్షమించండి అని చేతులు దులిపేసుకుంది. దీన్నెలా చూడాలి..?
ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే… ఎన్నికల తేదీల నిర్వహణలో కూడా రాజకీయ ప్రేరేపిత చర్యలు ఉన్నట్టే అనుమానించాల్సి ఉంది. ఆంధ్రా అసెంబ్లీకి ఇంకా గడువు ఉన్నప్పటికీ కూడా… ఎన్నికల షెడ్యూల్ లో తొలివిడతలోనే ఎన్నికలు పూర్తయ్యేలా తేదీల్ని పెట్టారు. ఆదరబాదరాగా ఏపీకి డేట్లు ఇచ్చేయాల్సినంత పనేముంది? పశ్చిమ బెంగాల్ ని తీసుకుంటే… మొత్తం 7 విడతల ఎన్నికలూ ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అంటే, ఈనెల 11 నుంచి వచ్చే నెల 19 వరకూ ఆ రాష్ట్రంలో ఎన్నికలే. పశ్చిమ బెంగాల్ మొత్తానికి ఒకేసారి లోక్ సభ ఎన్నికలు నిర్వహించలేరా…? ఒక దశలో 2, మరో దశలో 4, ఇంకో దశలో 5… ఇలా విడదీసి విడదీసి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు…? ఇలా సూక్ష్మదృష్టితో చూస్తుంటే ఏకంగా ఎన్నికల సంఘం పనితీరుపై చాలా అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంటే… ఈసీ పనితీరు శభాష్ అని మెచ్చుకుని లేఖలు రాసే నేతలు ఏపీలో మాత్రమే ఉండటాన్ని ఏమనుకోవాలి?