జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ యాత్రపై మిగిలిన వారికన్నా కాంగ్రెస్,బిజెపిలే ఎక్కువగా దాడి చేస్తున్నారు. ఆయన పోటీ వల్ల టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్టు చీలిపోతాయన్న ఆందోళన వాటికి వుంది.టిఆర్ఎస్ వరకూ ఆయన వల్ల లాభమూ లేదు నష్టమూ లేదు అంటున్నది. అయితే ఇప్పటికే నాలుగైదు శిబిరాలుగా వున్న ప్రతిపక్షంలో పవన్ వంటి జనాకర్షక నాయకుడు వచ్చి ఓట్లు తెచ్చకుంటే తనకే మంచిదన్న ఆలోచన వారికి లోలోపల వుంది. గతంలో సూటిగా కెసిఆర్ కుటుంబంపై దాడి చేసిన పవన్ ఇప్పుడు మాత్రం ఆయన స్మార్ట్ నాయకుడని పొగుడుతున్నారు. కాంగ్రెస్‌లో నా అన్న వున్నాడని కూడా చెబుతున్నారు. ఇక బిజెపిని ఆయనే గతంలో బలపర్చి వున్నారు. ప్రధాని మోడీని కూడా ప్రశంసగానే మాట్లాడుతుంటారు.కనుక పవన్ కళ్యాణ్ ప్రత్యేకంచి తమకు నష్టం చేస్తారని కాంగ్రెస్ నాయకులు అనుకోవడం హాస్యాస్పదం. కెసిఆర్ ప్రభుత్వ తప్పిదాలు ఏకరువు పెడుతూ వీటిని పవన్ ఎందుకు ఎదుర్కొవడం లేదు, కెసిఆర్‌ను ఎందుకు పొగుడుతున్నారని కాంగ్రెస్ బిజెపి నేతలు వాపోతున్నారు. అయితే ఇటు బిజెపి కేంద్రమంత్రసలే నిరంతరం పొగిడి పోతున్నారు. ఇక ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఒకప్పుడు బాగానే కెసిఆర్‌ను పొగిడారు.వీళ్లంతా పొగడొచ్చు గాని పవన్ అంటే తప్పొచ్చిందా అని మా చర్చల్లో ప్రస్తావించాను. తెలంగాణలో పవన్ చెప్పినంత అద్భుతంగా అలరాలుతున్నదేమీ లేదు.చాలా సమస్యలున్న మాట నిజం.వాటిని ఎప్పుడు ఏమేరకు చెప్పాలన్నది ఆయన విచక్షణ.ఏ మేరకు ఆదరించాలన్నది ప్రజల నిర్ణయం. అంతేగాని ఆయన తెలంగాణ రావడమే తప్పనట్టు తిట్టిపోడయం తగని పని.ఈ యాత్రతో తెలంగాణలో అభిమానులను అలరించిన పవన్ రెండు రాష్ట్రాల మధ్య ఇనుపగోడ ఏదీ లేదని నిరూపించారు. ఆ మేరకు ఆయన అభినందనీయులు. తక్కిందంతా భవిష్యత్తులో చూడాల్సిందే.