తెలంగాణ విద్యుత్ బకాయిలు ఇవ్వాలని కేంద్రం నుంచి ఎవరు వచ్చినా ఫిర్యాదు చేసే ఏపీ ప్రభుత్వ పెద్దలు నేరుగా విభజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం తన డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా తీసుకు రాలేదు. చాలా రోజుల తర్వాత విభజన సమస్యలపై కేంద్రం ముఖాముఖి భేటీ ఏర్పాటు చేసింది. ఇందులో రాజధాని కోసం నిధులు అడిగారు.. వెనుకబడిన జిల్లాలకు నిధులు అడిగారు కానీ… వాటికి యూసీలు సమర్పించలేదు.
అవి సమర్పిస్తే నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో తెలంగాణ తమకు రావాల్సిన నిధుల గురించి అడిగింది. అయితే అసలు కరెంట్ బకాయిల గురించి ఎవరూ మాట్లాడలేదు. నెల రోజుల్లో చెల్లించాలని కేంద్రం తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. తెలంగాణ సర్కార్ చెల్లించలేదు. ఈ విషయంపై స్పష్టంగా అడగాల్సిన ఏపీ సర్కార్ ప్రతినిధులు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వం తమకే ఏపీ సర్కార్ ఇవ్వాలని అంటోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేసింది.
అయితే హైకోర్టు డబ్బులు కట్టవద్దని ఏమీ చెప్పలేదు. కేవలం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.ఈ అంశంపై కేంద్రం గట్టిగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో వారు కూడా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీంతో ఈ విద్యుత్ బకాయిల అంశం ఇక కోర్టులో ఉండిపోవడమేనని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.