డీజీపీగా గౌతం సవాంగ్‌ను బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ పదవి నుంచి అవమానకర రీతిలో తొలగించినప్పుడు ఎప్పుడైనా గౌతం సవాంగ్‌కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తూనే ఉన్నాయి. ఆ ఘటన కాస్త ముందుగానే జరిగినట్లయింది. అయితే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి సవాంగ్‌పై కోపం పెంచుకోవడానికి అవమానకరంగా పంపడానికి కారణాలేమిటన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అది పోలీసు వ్యవస్థ పనితీరు గురించి మాత్రం కాదని ఓ నమ్మకం అందరిలోనూ ఉంది. ఎందుకంటే డీజీపీగా సవాంగ్ ఉన్నారు కానీ పోలీసు వ్యవస్థను నడిపిస్తోంది ఆయన కాదని .. ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.
పేరుకే డీజీపీ అంతా నడిపించేసి సజ్జలేగా !
పేరుకే డీజీపీగా గౌతం సవాంగ్ ఉంటారు. కానీ నిర్ణయాలు మాత్రం ఆయన చేతుల్లో ఉండవు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు… సకల శాఖా మంత్రిగా ప్రాచుర్యంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అనధికారిక హోంమంత్రిగా వ్యవహరిస్తారని చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పోలీసు అధికారులకు ఆయన నేరుగా ఆదేశాలిస్తారన్న విమర్శలూ ఉన్నాయి. హోంమంత్రి సుచరిత ఎప్పుడైనా పార్టీఆఫీసు నుంచి ప్రెస్మీట్లు పెట్టమని ఆదేశాలు వస్తే పాటిస్తారు తప్ప సమీక్షలు చేసే పరిస్థితి కూడా లేదు. డీజీపీ ఆఫీసులో సజ్జలకు చెందిన వ్యక్తులు అన్ని వ్యవస్థల్లో కీలకంగా ఉంటారని అక్కడి వ్యవహారాలు తెలిసిన వారందరికీ అనుభవమే. టీడీపీ ఆఫీసుపై దాడి సమయంలో ఓ సీఐ సివిల్ దుస్తుల్లో అల్లరి మూకలతో కలిసి దాడులు చేస్తూ దొరికిపోయారంటే .. అదీ డీజీపీ ఆఫీసులో పని చేసే సీఐ కావడం పరిస్థితికి అద్దం పడుతుంది.
రాజకీయ అరెస్టులనూ అడ్డుకున్న చరిత్ర లేదుగా !
ఇక రాజకీయంగా నేతల అరెస్టులన్నీ సీఐడీ చేతుల మీదుగా నడిపించేస్తూంటారు. రాజకీయ కక్ష సాధింపులన్నీ సీఐడీనే చూసుకుంటుంది. సవాంగ్‌కు సంబంధం ఉండదు. ఇటీవల అశోక్ బాబును అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అదనపు ఎస్పీని సంప్రదిస్తే తమకు తెలియదని సీఐడీనే అడగాలని చెప్పారు. అలా పోలీసు వ్యవస్థలో సీఐడీపై డీజీపీకి అసలు అదుపు లేకుండా పోయింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్ని డీజీపీ సవాంగ్ నిరాశపర్చలేదు. ఆయన సైలెంట్‌గా ఉండి. .. ఎప్పుడు ఏది మాట్లాడమని చెబితే అది మీడియాకు చెబుతూ వస్తున్నారు. తన పరువు పోతుందని తెలిసినా అదే చెప్పారు. ఓ సారిదాడులు చేస్తే భావన ప్రకటనా స్వేచ్చ అన్నారు. రకరకాలుగా మాట్లాడారు. అయితే అవన్నీ ఆయన ఇమేజ్ ను దిగజార్చాయి కానీ ప్రభుత్వ పెద్దల మెప్పును పొందగలిగారు.
బదిలీ చేయడానికి నిజమైన కారణం ఏమిటి ?
అయితే ఇప్పుడు ఆయనపై ఎందుకు వేటు వేశారన్నది మాత్రం పోలీసు వర్గాలకే అంతు బట్టకుండా ఉంది. సీఎం జగన్ గెలిచిన వెంటనే మొదటి చాయిస్‌గా సవాంగ్‌ను ఎంచుకున్నారు. జగన్ పదవీ బాధ్యతలు చేపట్టక ముందే సవాంగ్ యాక్షన్‌లోకి దిగిపోయారు. అప్పటి నుండి ఆయన పనితీరు విషయంలో ప్రభుత్వం ఎక్కడా అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరగలేదు. తెలుగుదేశం పార్టీ నేతలపై దాడుల విషయంలో, వారిపై కేసుల విషయంలో.. సోషల్ మీడియా పోస్టుల అరెస్టుల విషయంలో ప్రజల నుంచి విమర్శలు, కోర్టుల నుంచి నోటీసులు అందుకున్నా ప్రభుత్వం వరకూ ఆయన పనితీరుపై సంతృప్తికరంగానే ఉంది. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకలాగే ఉండవని సవాంగ్ బదిలీలో నిర్ధారణ అయిపోయింది. అలా బెడిసికొట్టడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు బయటకు తేలాల్సిన అంశం.