దేశంలో విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది. జూన్ లో ప్రారంభమవుతుంది. జూన్ మొదటి వారంలో విద్యా సంవత్సరం ప్రారంభించడం కామన్. అయితే ఏపీలో మాత్రం ఈ సారి జూలైలో ప్రారంభిస్తారు. కారణం ఏమిటంటే.. అమ్మఒడి పథకానికి డబ్బులు సర్దుబాటు చేసుకోవడం. జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకం డబ్బులు ఇవ్వలేదు. స్కూల్స్ ప్రారంభమయ్యాక జూన్‌లో ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు జూన్‌లోనూ డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కష్టమవుతుందని అనుకుంటున్నారేమో కానీ జూలైలోకి మార్చుకుంటున్నారు.
స్కూల్స్ ప్రారంభమైన వెంటనే ఇస్తామని చెబుతున్నారు. ఆ స్కూల్స్ ప్రారంభాన్ని ఓ నెల ఆలస్యం చేస్తున్నారు. అంటే విద్యార్థులకు ఏకంగా రెండు నెలల పాటు వేసవి సెలవులు వస్తాయన్నమాట. అయితే అనావృష్టి.. లేకపోతే అతి వృష్టి అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉండటం విద్యార్థుల్ని కూడా ఇబ్బంది పెడుతోంది. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను విలీనం చేస్తున్నారు. ఆరు రకాల స్కూల్స్ ఉంటాయని సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో చాలా స్కూళ్లను ఎత్తేయనున్నారు. వేరేవాటిలో విలీనం చేయబోతున్నారు.
ఆ విలీనం చేసిన తర్వాత ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయాలి. ఆలస్యం చేయడానికి ఈ కారణం చెబుతున్నారు కానీ.. జిల్లాలనే రాత్రికిరాత్రి విభజించి.. ఉద్యోగుల్ని సర్దుబాటు చేసిన ప్రభుత్వానికి… ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయడానికి నెలల సమయం ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమ్మఒడికి నిధులు సర్దుబాటు చేసుకోవడం కష్టంగా మారిందని.. జూలైలోపు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.