ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మూడు రాజధానులపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. సీఎం జగన్ మాట్లాడారు. చర్చ జరుగుతున్నప్పుడు కానీ.. ముగిసినప్పుడు కానీ బిల్లు పెడుతున్నామని చెప్పలేదు. కానీ వికేంద్రీకరణే మా విధానమని చెప్పారు. కానీ బిల్లు పెట్టకుండా వికేంద్రీకరణ ఎలా సాధ్యమవుతుందో చెప్పలేకపోారు. మూడు రాజధానుల బిల్లు పెట్టాలని ప్రభుత్వం గట్టిగా అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి బిల్లు డ్రాప్ట్ కూడా రెడీ అయిందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో పరిపాలనా రాజధాని అని.. గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. అంటే ఇప్పుడు వెనక్కి తగ్గినట్లే.
సాంకేతికంగా, న్యాయపరంగా చూస్తే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టడం అసాధ్యం. ఇప్పటికే రెండు సార్లు బిల్లు పెట్టారు. ఓ సారి శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపినా ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోకుండా మరోసారి బిల్లు పెట్టి ఆమోదించారు. గవర్నర్ ఆమోదించినా న్యాయపరమైన చిక్కులు రావడంతో చివరికి హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతూండగా వెనక్కి తీసుకున్నారు. కానీ ఆ బిల్లుపై పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.
అదే సమయంలో రాజధాని రైతులు వేసి పిటిషన్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అంటే రాజదాని విషయంలో చట్టసభలకు కూడా మార్చే అధికారం లేదని తేల్చేసిది. ఈ తీర్పు ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టడం న్యాయవ్యవస్థ తీర్పును ఉల్లంఘించడం. అదే జరిగితే రాజ్యంగ సంక్షోభం వచ్చినట్లేనని నిపుణుల వాదన. బిల్లు చేసే అధికారం ఉందని జగన్ నిరూపించే అవకాశం ఉందంటున్నారు. గతంలో ఇదే అంశంపై అసెంబ్లీలో జగన్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. న్యాయవ్యవస్థ.. శాసన వ్యవస్థలోకి చొచ్చుకు వస్తుందని దీనికి అంగీకరించబోమని తీర్మానం కూడా చేశారు. ఇప్పుడు చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో అయినా దీన్ని నిజం చేస్తారేమో చూడాలి. లేకపోతే వెనక్కి తగ్గినట్లేనన్న భావన వస్తుంది.