దేశంలో ఇప్పుడు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పరీక్ష నీట్‌పై రచ్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలో అవకతవకలు బయటపడుతున్నాయి. తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా రాష్ట్రాలు వాయిస్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఆరోపిస్తూ.. తెలంగాణ స్థాయిలో బీఆర్ఎస్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది. మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. తమిళనాడులో నీట్ పరీక్షకు అక్కడి పార్టీలన్నీ ఎప్పుడూ వ్యతిరేకమే.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మాత్రం.. ఈ అంశంతో అసలు తమకు సంబంధంలేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి. నీట్ గురించి ప్రశ్నించడానికి.. అందులో బయటపడ్డ అవకతవకల గురించి లేదా ఆ ఎగ్జామ్ మంచిదేనని సర్టిఫికెట్ ఇవ్వడానికేనా నోరు తెరవడం లేదు. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ఈ విషయంలో రిజర్వేషన్స్ ఉన్నాయనుకున్నా.. వైసీపీ కూడా సైలెంట్ గా ఉంటోంది. ప్రతిపక్ష హోదా రాకపోవడానికి.. ఇలాంటి అంశాలపై స్పందించడానికి సంబంధం ఏమీ ఉండదు.
అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించలేరు… రాష్ట్రాన్ని అడగలేరు. గతంలోనూ ఇలాంటి పరిస్థితోలనే ఉన్నా.. బీజేపీని ప్రశ్నిస్తున్నట్లుగా నటిస్తూ ఎలాగోలా ప్రజల్ని నమ్మించారు. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే బీజేపీ వైఫల్యాలపై పల్తెత్తు మాట అనే పరిస్థితి లేకుండా పోయింది.