రాజకీయంగా అధికార పార్టీ కోసం ప్రతిపక్ష పార్టీల నేతలపై తప్పుడు కేసులు పెట్టడం..అధికార పార్టీ నేతలు ఎన్ని దారుణాలకు పాల్పడ్డా వదిలి పెట్టడంలో ఏపీ పోలీసులు ఓ బ్రాండ్ సృష్టించేసుకున్నారు. చివరికి కళ్ల ముందు కనిపిస్తున్న నిజాన్ని కూడా అబద్దం అని చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేసి దారుణంగా చులకన అయిపోయారు. పోలీసు వ్యవస్థకు ఇంత కంటే దారుణమైన పతనం ఉండదని ఎవరైనా విశ్లేషిస్తే అది వారి తప్పు కాదు.. ప్రజాధనం జీతంగా తీసుకుంటూ.. తప్పుడు పనులు చేసిన వారికి.. నేరస్తులకు .. అనుకూలంగా మాట్లాడుతున్న వారిదే తప్పు.
హవ్వ .. గోరంట్ల విషయంలో ఇదా పోలీసుల నిర్వాకం !
ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల అవునో కాదోనని ఎస్పీ ఫక్కీరప్ప నోటి వెంట వచ్చిన మాటలు.. సామాన్య జనాన్ని నివ్వెర పరిచాయి. ఎస్పీ స్థాయి అధికారి వీడియోను ఫోరెన్సిక్‌కు పంపకుండా కథలు చెప్పి.. టీడీపీ వాళ్లు సర్క్యూలేట్ చేశారని రాజకీయం చేశారు. అక్కడ అసలు విషయం ఆ వీడియోలో ఎంపీ గోరంట్ల అనైతిక పని చేశాడా లేదా.. మహిళల్ని లైంగికంగా వేదించాడా లేదా అన్నది విషయం. దాన్ని నిస్సిగ్గుగా సమర్థించారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఎన్నిమేర విలువలు నేర్చుకున్నారో.. తన సర్వీస్‌లో వేసుకున్న యూనిఫాంకుఎంత న్యాయం చేశారో ఈ ఒక్క ప్రెస్‌మీట్‌తోనే ఆయనపై ఓ అంచనాకు రావొచ్చు.
ఎమ్మెల్సీ హత్య చేస్తే .. హంతకుడ్ని సమర్థిస్తారా ?
ఒక్క గోరంట్ల ఇష్యూలోనే కాదు.. ఓ దళిత వ్యక్తిని చంపి.. శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తే పోలీసులు వ్యవహరించిన తీరు అసహ్యం పుట్టేలా ఉందని అందరూ చెప్పుకున్నారు. హంతకుడైన ఎమ్మెల్సీపై రౌడీషీట్ ఉంటే.. అలాంటిదేమీ లేదని..ఆయన నేర చరితలేదని కోర్టుకు చెప్పి.. వీళ్లా పోలీసులు అని అనుకునేలా చేశారు. అసలేం జరిగిందో విచారణ చేయకుండా.. కేవలం ఎమ్మెల్సీ చెప్పిందే చెప్పి.. కేసు ఫైల్‌ను పక్కన పెట్టేసిన పోలీసు తీరు.. వ్యవస్థపై అనుమానాలు రేకెత్తించేలానే ఉంది.
రౌడీలను కాపాడేందుకే పోలీసు వ్యవస్థా ?
ఈ రెండు అత్యంత దారుణమైన ఘటనలు.. వీటిలోనే ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ పని చేస్తే. ఇక సామాన్యుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు..? ఎంత మందికి అన్యాయం చేశారు ? ఎంత మంది రౌడీలు.. గూండాల పట్ల సానుకూలంగా వ్యవహరించారు.. వారందరూ ప్రజలపై పడి వధించేలా చేస్తున్నారు ?. కనీసం తాము వేసుకునన ఖాకీ డ్రెస్‌కు అయినా కాస్త గౌరవం ఇచ్చి ఉంటే.. వ్యవస్థపై ప్రజల్లో కాస్త గౌరవం అయినా ఉండేది. ఇప్పుడు అదేమీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.