దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటింది. అయినప్పటికీ ఇప్పటికీ వివాదాస్పదమైన అంశం ఒకటి రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అదే రిజర్వేషన్లు. ఈ రావణకాష్టం ఆరిపోవడం రాజకీయ నాయకులకు ఇష్టం లేదు. రాజకీయాలు చేయడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి రిజర్వేషన్ల ఆయుధం ఉండాల్సిందే. తరతరాలుగా రగులుతున్న జమ్మూ కాశ్మీర్ సమస్యను, అయోధ్య సమస్యను పరిష్కరించిన మోదీ సర్కారు రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించలేదు. ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు జరిగినంతకాలం కులాలు ఉంటాయి. కుల రాజకీయాలు ఉంటాయి. కులరహిత సమాజం రావాలని, కావాలని చాలామంది రాజకీయ నాయకులు, పాలకులు వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇది పైకి మాత్రమే. లోపల మాత్రం రిజర్వేషన్లు ఉండాల్సిందే.
కుల రాజకీయాలు చేయాల్సిందేనని అనుకుంటారు. రిజర్వేషన్లు అనేది చాలా పెద్ద వివాదాస్పదమైన సబ్జెక్టు. ఇదో పెద్ద తేనెటీగల తుట్టె. బడుగు బలహీనవర్గాల్లో అంటే ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తింపచేయాల్సిందే. వారు అన్నివిధాల వెనకబడి ఉంటే, దయనీయ స్థితిలో ఉంటే వారు బాగుపడటానికి రిజర్వేషన్ల ద్వారా చేయూత ఇవ్వాల్సిందే. కాని ఎస్సీల్లో, ఎస్టీల్లో సంపన్నులకు రిజర్వేషన్లు ఎందుకు? రిజర్వేషన్ల కారణంగా నష్టపోయి, కడుపు మండిపోతున్న చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు అవసరం గాని సమాజంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన తరువాత కూడా రిజర్వేషన్లు ఎందుకు?
ఇందుకు రాజకీయ నాయకులు చెప్పే సమాధానం…వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెంది ఉండొచ్చు. కాని వెనకబడిన కులంవారు. ఇక్కడే కొంతమందికి కాలిపోతున్నది. అన్ని విధాల అభివృద్ధి చెందిన తరువాత ఇంకా కులాన్ని అడ్డం పెట్టుకొని తరతరాలుగా వారి వారసులంతా రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందటమేమిటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలోనే అమలు జరుగుతున్నాయి. దీన్ని ప్రయివేటు రంగానికి కూడా వర్తింపచేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ప్రయివేటు రంగం తిరస్కరించింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాల్సివస్తే తమ సంస్థలను మూసేస్తామని కొందరు పారిశ్రామికవేత్తలు చెప్పిన సందర్భాలున్నాయి.
తాజాగా ‘క్రీమీలేయర్’ (ఎస్సీ, బీసీ, ఎస్టీల్లో సంపన్నవర్గం) వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరమీదికి తెచ్చింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాల్లో సంపన్నవర్గాలకు రిజర్వేషన్లు అక్కర్లేదంటూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. రిజర్వుడు వర్గాల్లోని సంపన్నులకు కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేయొద్దని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సమీక్షించాలని ఇప్పుడు కేంద్రం కోరుతోంది. క్రీమిలేయర్‌ను ఎస్సీ, ఎస్టీలకు వర్తింపచేయొద్దని కోరుతోంది. నిజానికి ఇది మంచి తీర్పే కదా. ‘ఇది సున్నితమైన భావోద్వేగాల సమస్య’ అని కేంద్రం చెబుతోంది.
ఇలా అనుకుంటే ప్రతి సమస్య భావోద్వేగాలతో కూడుకున్నదే. కేంద్రం వైఖరిని ఎస్సీ, ఎస్టీల్లోని పేద వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును తిరగదోడవద్దని కోరుతున్నాయి. ధనికులకు క్రీమిలేయర్ వర్తింపచేయవద్దని కేంద్రం కోరుతున్నదంటే బీజేపీ ధనికులకు, సంపన్నులకు మద్దతు పలుకుతున్నట్లే భావించాలి. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, అయోధ్య వివాదాలను పరిష్కరించామంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ఈ రావణకాష్టాన్ని మళ్లీ రగిలించడం ఎందుకు? ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోంది?