రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అయితే..భారతీయ జనతా పార్టీ పెద్దలకు అత్యంత ఆప్తుడిగా పేరు పొందిన ఆర్నాబ్… దక్షిణాదిపై పెద్దగా దృష్టి పెట్టరు. టీడీపీ హయాంలో తిరుమల ఆలయం విషయంలో వివాదాస్ప కథనాలు ప్రసారం చేశారు. అనూహ్యంగా ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ టార్గెట్‌గా… కొన్ని కొన్నికథనాలు ప్రసారం చేస్తున్నారు. ఆర్థిక అవకతవకలు… పార్టీలో తిరుగుబాటుఅంటూ రకరకాలుగా చెబుతున్నారు. ఈ కథనాలు వైసీపీలోనూ గందరగోళం రేపుతున్నాయి. దీంతో సజ్జల లాంటి వారు మీడియా ముందుకు వచ్చి ఖండించాల్సి వస్తోంది.
రిపబ్లిక్ టీవీకి బీజేపీ ఎంతో.. బీజేపీ మిత్రులు కూడా అంతే. వారిగురించి ప్రత్యేకంగా ఎక్కడా నెగెటివ్ కథనాలు ప్రసారం చేయదు. బీజేపీ మిత్రులుగా పేరు పడిన వైసీపీ విషయంలో కూడా రిపబ్లిక్ టీవీ నిన్నామొన్నటి వరకూ సైలెంట్ గానే ఉండేది. ఇప్పుడు అనూహ్యంగా… వ్యతిరేక కథనాలు రాస్తోంది. వ్యతిరేకం అంటే.. ఆషామాషీకాదు. వైసీపీలో కంగారెత్తించేంతగా ఆ కథనాలు ఉంటున్నాయి. ఆర్థిక అవకతవకలపై విదేశీయులు ఫిర్యాదు చేశారంటూ.. రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత తిరుగుబాటు అనే వార్త చెప్పింది. ఆ కథనం ఎలా ఉందంటే.. ప్రభుత్వంలో పదవులు ఇచ్చి… వారికి తెలియకుండా వారి పేరు ద్వారా హవాలా రాకెట్ నడుపుతున్నారని…ఆ విషయం తెలిసి వారు తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నట్లుగా.. పరోక్షంగా రిపబ్లిక్ టీవీ సందేశాన్ని పంపింది.
అందుకే… వైసీపీ డిఫ్యాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడిగా తెర ముందుకు వచ్చి ఖండించారు. ఆర్నాబ్ పై తిట్ల దండకం అందుకున్నారు. ఒక్క సారిగా రిపబ్లిక్ టీవీ వైసీపీకి ఎందుకు వ్యతిరేకంగా మారిపోయిందో.. అని వైసీపీ నేతలు కూడా తలలు పీక్కుంటున్నారు. వైసీపీని బీజేపీ దూరం పెట్టాలనుకుంటుందా అన్న సందేహం ఓ వైపు వస్తోంది.. మరో వైపు బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏదైనా మద్దతు కోరుకుంటుందా.. అన్న అనుమానం కూడా వస్తోంది. అన్నింటినీ వేసినట్లుగా ఆర్నాబ్ పై టీడీపీ ముత్ర వేస్తే.. కామెడీ అవుతామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఉన్న.. మీడియా సలహాదారులతో పరిస్థితిని చక్క బెట్టాలనిలేకపోతే.. రిపబ్లిక్ టీవీ కలకలం రేపడం కొనసాగిస్తూనే ఉంటుందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.