వైఎస్ వివేకా హత్య కేసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ… అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకోడం అసాధ్యమని అనుకుంటున్నారు. ఆయన ఎన్ని అతి తెలివి ప్రయత్నాలు చేస్తే అంతగా కూరుకుపోతారని న్యాయ శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న వారు కూడా చెబుతున్నారు. కానీ ఎందుకో కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారేమోనని భయపడిపారిపోతున్నారు. చిన్నపిల్లవాడు ఇంజక్షన్ చేస్తారని భయపడి డాక్టర్ వద్దకు వెళ్లడానికి ఎలా భయపడి.. దొంగ సాకులు చెబుతాడో అలా చెబుతున్నారు . దీని వల్ల అవినాష్ రెడ్డి సీబీఐని మరింతగా ఇబ్బంది పెట్టి.. పట్టుదలగా మార్చడం తప్ప.. చేయగలిగిందేమీ లేదన్న వాదన వినపిసిస్తోంది.
అసలు జైలుకెళ్లడానికి అవినాష్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారన్నది చాలా అర్థం కావడం లేదు. జైలు అంటే.. వైఎస్ ఫ్యామిలీలో చాలా మందికి చిన్న విషయమే. కేసులు అంటే రొటీన్.అలా జైలుకెళ్లి ఇలా వచ్చేస్తూంటారు. అంత వరకూ ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పదహారు నెలలుజైల్లో ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి వేసిన వేషాల్లో ఒక్కటి కూడా వేయలేదు. రైట్ రాయల్ గా జైలుకు వెళ్లారు. పదహారు నెలలు ఉన్నారు. బయట ఆయన కోసం పని చేసిన వారు చేశారు. అవినాష్ రెడ్డి తనకు చాలా పెద్ద బలగం ఉండగా ఎందుకు భయపడుతున్నారన్నది సీక్రెట్ గా మారింది.
సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఒకదాని తర్వాత ఒకటి పదే పదే పిటిషన్లు వేసి.. వాటిపై విచారణ జరగాల్సి ఉంది కాబట్టి తాను విచారణకు రానన్నట్లుగా ఆయన మాట్లాడటం మరీ పిల్లచేష్టలాగా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఒకటి, రెండు రోజులు ఆయన తప్పించుకోవచ్చు కానీ..ఎప్పుడైనా అరెస్ట్ కాక తప్పదని.. అంటున్నారు. విచిత్రంగా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్న 27వ తేదీ వరకే తనకు మినహాయింపు కావాలని ఆయన సీబీఐని కోరుతున్నారు.