ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరపతి.. ఆర్థిక ప్రపంచంలో దారుణంగా పడిపోయింది. ప్రభుత్వం సొంతంగా గ్యారంటీ ఇస్తామన్నా బ్యాంకులు… రూ. రెండు, మూడు వేల కోట్ల రుణాలివ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. అనేక రకాల సందేహాలను లెవనెత్తుతున్నాయి. నిజానికి ప్రభుత్వమే నేరుగా అడిగితే బ్యాంకులు రుణాలివ్వడానికి ఉత్సాహం చూపిస్తాయి. ఎందుకంటే.. వ్యాపార సంస్థలు డిఫాల్ట్ అవుతాయేమో కానీ.. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి. కానీ.. ఏపీ విషయంలో మాత్రం.. బ్యాంకులు ప్రభుత్వం డిఫాల్ట్ అవుతుందనే అభిప్రాయానికి వస్తున్నాయి.
గత ప్రభుత్వం నిర్ణయాలతో సంబంధం లేదనడంతోనే విశ్వసనీయత ప్రశ్నార్థకం..!
జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అంటే.. తనదైన అర్థం చెప్పుకున్నారు. ప్రభుత్వం అంటే.. టీడీపీ ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారు కానీ.. ప్రజాప్రభుత్వం అనుకోవడం లేదు. అందుకే.. గత టీడీపీ ప్రభుత్వం అంటూ… ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను .. చేసిన అప్పుల బాధ్యతలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో.. అనుమానం ప్రారంభమయింది. ఇప్పుడు జగన్ ఇలా చేస్తే.. రేపు వచ్చే సీఎం.. తమ రుణానికి కట్టుబడి ఉంటారన్న గ్యాంరటీ ఏమిటనే ప్రశ్న మొహం మీదనే అడిగేస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న రుణాలకు తాము గ్యారంటీలను ఉపసంహరించబోమని ప్రభుత్వం.. ఎంతగా చెబుతున్నా… నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ప్రభుత్వం ఇప్పటికే.. గత సర్కార్ నిర్ణయాలను తిరగదోడటమో… నిలిపివేయడమో.. తమకు సంబంధం లేదని చెప్పడమో జరిగిపోయింది. అవి బ్యాంకుల మదిలో ఉన్నాయి.
అప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారని నమ్ముతున్న బ్యాంకులు..!
సాధారణంగా బ్యాంకులు అప్పులు ఇవ్వాలంటే.. ఆ డబ్బులతో ఏం చేస్తారని ప్రశ్నిస్తాయి. అది వాటికి చాలా ముఖ్యం. ఎందుకంటే.. తాము ఇచ్చే డబ్బులతో వ్యాపారమో… మరొకటో చేసి.. సంపద పెంచితేనే… తమ రుణాలకు సార్థకత, గ్యారంటీ ఉంటాయని భావిస్తాయి. కానీ రుణాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం… వాటిని సంక్షేమ పథకాల పేరుతో.. ప్రజలకు పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇలా ప్రజలకు డబ్బులు పంచడానికి డబ్బులిచ్చేంత ఔదర్యాన్ని బ్యాంకులు చూపడం లేదు. మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం అయితే ఇస్తారు కానీ… మేనిఫెస్టో అమలు కోసం ఇవ్వడం బ్యాంకుల పని కాదు.
ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన పాలనపై ఎవరికి నమ్మకం ఉంటుంది..?
నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఆదాయం 40 శాతం పడిపోయిందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా స్వయం కృతం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజల ఆదాయం పడిపోయింది. భవన నిర్మాణ కూలీ దగ్గర్నుంచి హోటల్ పరిశ్రమ వ్యాపారుల వరకూ ప్రతి ఒక్కరూ సగానికి సగం ఆదాయం కోల్పోయారు. జీడీపీ తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది..? అన్నీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే వచ్చింది. ఇలాంటి డిజాస్టర్ నిర్ణయాల ప్రభుత్వం ఉన్నప్పుడు.. బ్యాంకులు కానీ.. ఆర్థిక సంస్థలు కానీ రుణాలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తాయి…?