గత పదేళ్లుగా దేశం మొత్తంలో ఎక్కడా కూడా ప్రతిపక్షాల ప్రభుత్వాలు ప్రశాంతంగా పాలన చేసిన పరిస్థితి ఎక్కడా లేదు అనే ఆరోపణలు విన్నాం. ఎన్డియేలో ఉన్న పార్టీలకు కూడా కొన్ని సందర్భాల్లో గాలి ఆడలేదు. అందుకే అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డియే నుంచి బయటకు వచ్చారు. నవీన్ పట్నాయక్, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు బిజెపికి ఇబ్బంది లేకుండా పాలించారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఎక్కడా బిజెపికి ఎదురు వెళ్ళే సాహసం చేయలేదు. కాని ఓ ముఖ్యమంత్రి విషయంలో అంతా సౌకర్యవంతంగా ఉంది. ఏ నిర్ణయం అమలు చేయాలనుకున్నా సరే దానికి ఏ వైపు నుంచి అడ్డు ఉండటం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకునే నిర్ణయాలకు బీజేపి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే భావన చాలా మందిలో ఉంది. అసలు ఎవరా ముఖ్యమంత్రి అంటే…
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పటి వరకు రేవంత్ కు కేంద్రం నుంచి వచ్చిన చిన్న ఇబ్బంది కూడా లేదు. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ బిజేపి ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకపోయినా ఆయన స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోయేవారు. కాని రేవంత్ విషయంలో అంతా సీన్ రివర్స్. హైడ్రా విషయమే చూద్దాం. హైడ్రాకు బిజెపి నేతల అందరి నుంచి మద్దతు పరోక్షంగా ఉంది. ఒక్క ఈటెల రాజేంద్ర నుంచి మినహా. హైదరాబాద్ ను కబ్జాల నుంచి విడిపించండి, కాని అందరివి కూల్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు మినహా ఎక్కడా రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకించడం లేదు. ధర్మపురి అరవింద్ పెద్దగా మాట్లాడటం ల్లేదు… రఘునందన్ రావు, బండి సంజయ్ సహా పలువురు నేతలు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి రేవంత్ పై విమర్శలు వస్తే… కాంగ్రెస్ నేతల కంటే వేగంగా మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. రేవంత్ ను విమర్శించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఇక ఇప్పుడు హైడ్రాకు కేంద్రం మద్దతు ఉందనే సంకేతాలు కాస్తో కూస్తో వచ్చాయి. హైడ్రాకు కేబినేట్ లో చట్టబద్దత కల్పించి ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపగా… ఆయన ఆర్డినెన్స్ పై సంతకం చేసారు. దీనికి పెద్దగా సమయం కూడా పట్టలేదు. సాధారణంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజ్ భవన్ విషయంలో సీన్ ఇలా ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నర్ అడ్డు చెప్పేవారు. గవర్నర్ నుంచి ముఖ్యమంత్రికి చాలా చికాకులు ఉండేవి. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముడా కేసులో గవర్నర్ నుంచే ముందు ఇబ్బంది పడి… అది కేసు వరకు వెళ్ళింది.
కాని రేవంత్ నిర్ణయానికి గవర్నర్ నుంచి అడ్డు రాలేదు. అసలు గవర్నర్ కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెట్టడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నర్ హోదాలో తమిళ సై చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. తొలిసారి ఓ గవర్నర్ ప్రజా దర్భార్ నిర్వహించే వరకు వెళ్ళారు అప్పట్లో. ప్రభుత్వ యూనివర్సిటీలకు గవర్నర్ చాన్సలర్ గా ఉంటారు. ఆ పదవితో కూడా కేసీఆర్ సర్కార్ కు ఊపిరి ఆడకుండా చేసారు. ఇక హైకోర్ట్ తీర్పుల విషయంలో గతంలో భిన్నాభిప్రాయాలు ఉండేవి.
ఇక రేవంత్ పదే పదే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. పదేళ్ళలో ఏ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి గాని ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్ళలేదు. వెళ్ళినా టెన్ జన్ పద్ వరకే వారి ప్రయాణం ఉండేది. కాని రేవంత్ కాన్వాయ్ నేరుగా కేంద్ర మంత్రుల ఇళ్ళకు లేదంటే వారి కార్యాలయాలకు వెళ్తోంది. బీజేపి ఏదైనా ప్రభుత్వాన్ని కూల్చాలి అనే లక్ష్యం పెట్టుకుంటే అది పెద్ద మేటర్ కాదు. మూడు పార్టీలు ఏకతాటి మీద ఉన్న మహారాష్ట్రలో ఏకంగా శివసేన పార్టీలోనే చీలిక తెచ్చింది. కాని 64 స్థానాలతో బొటా బోటీ మెజారిటీ ఉన్న రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టడం లేదు. కేంద్రం నుంచి నిధులు కూడా వస్తున్నాయి. ఇటీవల వరద సాయంలో తెలంగాణకు తక్కువేం ఇవ్వలేదు. తెలంగాణా చెల్లించాల్సిన బకాయిలను కూడా ఏపీకి కేంద్రమే చెల్లించడం బోనస్. మరి దీని వెనుక కారణం ఏంటో తెలియదు గాని రేవంత్ మాత్రం చాలా స్వేచ్చగా పాలిస్తున్నారు.
భవిష్యత్తులో రేవంత్ అడుగులు ఎలా ఉంటాయో తెలియదు. కాని ఆయన రాజకీయ లక్ష్యాలు కచ్చితంగా పెద్దవే. ఆ లక్ష్యం అర్ధం కాకనే కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుడు కూడా తక్కువ అంచనా వేసి చేతులు కాల్చుకుని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ రాజకీయ లక్ష్యాలతోనే ఒక భుజంపై కాంగ్రెస్ ను ఒక భుజంపై బిజెపిని మోస్తున్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. శారీరకంగా సన్నగా రివటలా ఉండే సిఎంకు ఇది పెద్ద బరువే మరి. పదే పదే నేనే తెలంగాణాకు పదేళ్ళు ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ చెప్తూ ఉంటారు. రేవంత్ లాంటి నాయకుడు ఆ మాట అంత ఈజీగా మాట్లాడరు. దక్షినాదిలో పాగా కోసం విశ్వ ప్రయత్నాలు చేసే బిజెపికి ఇప్పుడు ఏపీ మినహా మరో రాష్ట్రంలో అధికారం లేదు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో విపక్షాలు బలంగా ఉన్నాయి. తెలంగాణాలో బీఆర్ఎస్ బలం ఏంటో ప్రస్తుతానికి చెప్పలేం. ఇప్పటికే లోక్సభలో గులాబి పార్టీని సున్నా చేసిన కాంగ్రెస్ బిజెపి… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ రాజకీయం చేస్తాయో చూడాలి. ఏది ఎలా ఉన్నా రేవంత్ ఆల్ హ్యాపీస్. కాని ఒక్క మాట… రేవంత్ లక్ష్యాలు అర్ధమైతే బీఆర్ఎస్ నేతలకు తమ భవిష్యత్తుపై కూడా క్లారిటీ వస్తుంది.