తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు అన్నామలై.. డీఎంకే నేతల జాబితాను రెడీ చేసుకుని వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ ఉంటారు. ఆ పవర్ ఆయనకు ఇచ్చారు. కానీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసే పిర్యాదుల్ని కనీసం బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఏపీ అధ్యక్షురాలిగా బాద్యతలు ఇచ్చారనే పేరే కానీ.. ఆమెకు ఇసుమంత కూడా సహకారం హైకమాండ్ ఇవ్వడం లేదు.
ఏపీలో అవకతవకలపై ఆమె పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పోరాడుతూనే ఉన్నారు. ఆర్థిక అవకతవకలు, మద్యం స్కాం గురించి ఎంత వివరణాత్మకంగా ఫిర్యాదులు చేసినా పట్టించకోవడం లేదు. ఇంకా ఘోరంగా నిర్మలా సీతారామన్.. అప్పులపై.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను పార్లమెంట్ లో ప్రకటించి పురందేశ్వరి పరువు తీశారు. ఈ విషయాన్ని పురందేశ్వరి కూడా చెప్పుకుని బాధపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ నిర్వాకం వల్ల… తమ పార్టీ ఇబ్బందుల్లో పడిందని లేఖలో చెప్పుకున్నారు.
ఇక మద్యం స్కాం గురించి పూర్తి వివరాలతో లే్ఖ ఇచ్చారు. పెద్ద ఎత్తున మనలాండరింగ్ జరుగుతోందని ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పిర్యాదు చేశారు. కానీ.. పట్టించుకున్న వారు లేరు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం వందల కోట్లలోనే ఉంటుంది. కానీ ఏపీలో జరిగింది మాత్రం వేల కోట్లలో ఉంటుంది. మద్యం తయారీ, రవాణా, అమ్మకం సహా మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోనే ఉంది. పూర్తిగా క్యాష్ ట్రాన్సక్షన్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎటు పోతుందో తేలాల్సి ఉంది.
అన్నీ చెప్పినా … పురందేశ్వరి లెక్కలోకి తీసుకునేందుకు నిర్మలా సీతారామన్ సిద్ధంగా లేరు. ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదు. అప్పుల లెక్కలు తేల్చడం లేదు. లిక్కర్ దందాపై విచారణకు ఆదేశించడం లేదు. అంటే ఏపీలో.. వారికి బీజేపీ కన్నా.. వైసీపీ నే ఎక్కువని అర్థమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పురందేశ్వరి మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు.