తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్నారు. కానీ బీజేపీ నేతలు స్తబ్దుగా ఉండిపోయారు. దీనికి కారణం పార్టీలో చేసిన మార్పులే. ఈ మార్పుల కారణంగా సాగిపోతున్న పార్టీకి ఒక్క సారిగా బ్రేక్ పడినట్లయింది. ప్రధానమంత్రి పర్యటనకు పెద్దగా హైప్ రాకపోవడంతో .. జన సమీకరణ విషయంలో ఆ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. బహిరంగసభను బీజేపీ తరపునే నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ పార్టీ చీఫ్ మార్పు విషయాన్ని.. ఈటల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
మరో వైపు తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ గా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ కు బాధ్యతలు అప్పగించారు. ప్రకాష్ జవదేకర్ 2014 ఎన్నికల సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో బీజేపీ తరపున కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ప్రకాష్ జవదేకర్ అంతా తానై వ్యవహరించారు. దీంతో మళ్లీ పొత్తుల ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా అన్న చర్చ తెలంగాణ బీజేపీలో ఏర్పడింది.
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ వెనుకబడిందన్న వాతావరణం ఏర్పడింది. పార్టీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోగా ఉన్న వారు కూడా వెళ్లిపోతారన్న పుకార్లు వచ్చాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఓ అవగాహనకు వచ్చాయన్న అనుమనాలు బలంగా వినిపిస్తోంది. దీంతో ఇవన్నీ రూమర్సేనని బీజేపీ బలంగా విజయం కోసం ప్రయత్నించబోతోందని నిరూపించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వరంగల్ సభలో బీఆర్ఎస్పై విరుచుకుపడటం ద్వారా .. ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని మోదీ సందేశం ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. అయితే మాటలతో ప్రజలు కన్విన్స్ కారని అంటున్నారు.