మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఐ.ఎన్.ఎక్స్. మీడియా సంస్థలోకి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించే విషయంలో దాదాపు రూ. 5 కోట్లు లంచం తీసుకున్నారన్నది సీబీఐ అభియోగం. దీంతో ఆయన్ని చెన్నై విమానాశ్రయంలోనే ప్రశ్నించి, అక్కడికక్కడే నాటకీయంగా అరెస్టు చేశారు. అయితే, 2007 నాటి ఒక పాత కేసును ఉద్దేశపూర్వకంగానే తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కార్తీ చిదంబరం ఆరోపిస్తున్నారు. తన తండ్రిని లక్ష్యంగా చేసుకుని మోడీ సర్కారు సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యగా దీన్ని ఆయన చెబుతున్నారు.
ఇక, కార్తీ అరెస్ట్ నేపథ్యంలో భాజపా నేతలు హడావుడిగా స్పందిచేస్తున్నారు. ఎట్టుకేలకు సీబీఐ తన పని సక్రమంగా చేసిందనీ, తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మెచ్చుకున్నారు. చట్టం తన పని తాను చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అనీ, చట్టం దృష్టిలో అందరూ సమానం అనడానికి ఇదే సాక్ష్యమంటూ మరో నేత సబితా పాత్ర కొనియాడారు. ఇలా మరికొంతమంది భాజపా నేతలు మీడియా ముందుకు వచ్చి కార్తి అరెస్టును సమర్థిస్తున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులనీ, తప్పు చేసినవారు ఏ స్థాయి వారైనా ఉపేక్షించేది లేదని అంటున్నారు.
అయితే, ఉన్నట్టుండి భాజపా నేతలంతా ఈ కేసు విషయంలో ఎందుకింత హడావుడి చేస్తున్నారు. ఏదో భారీ కుంభకోణాన్ని వెలికి తీసినట్టుగా, చిదంబరం కుమారుడు అరెస్టును సంచలనం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. పోనీ, కోట్లుకు కోట్లు అవినీతా అంటే… కార్తీ తీసుకున్నాడంటూ ఆరోపిస్తున్న ఆ లంచం కూడా చిన్న నంబరే. లంచం ఎంతైనా సమర్థనీయం కాదుగానీ, ఇంతకంటే వందల కోట్ల అవినీతి కనిపిస్తున్న కేసుల్లో లేని హడావుడి దీనిపై ఎందుకున్నది ప్రశ్న..? ఓపక్క పీఎన్బీ కేసులో కేంద్రం పరువు పోతోంది. మరోపక్క అమిత్ షాపై ఉన్న కేసు విషయమై ఢిల్లీలోని ఆప్ నేతలు చేస్తున్న విమర్శలు.. ఇలాంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నామా ఇది అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలక కాదనీ, అధికార పార్టీ ఏం చెప్పినా వినే చిలకగా మాపోయిందని కాంగ్రెస్ నేతల కపిల్ సిబల్ విమర్శిస్తున్నారు. కార్తీ కేసు విషయంలో చిదంబరంపై కూడా చర్యలుండొచ్చనే అభిప్రాయాలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ విషయంలో భాజపా ఓవర్ రియాక్షన్ చూస్తుంటే… దీని వెనక ఏదో రాజకీయ కోణం ఉందనే అనుమానాలైతే బలంగా వ్యక్తమౌతున్నాయి.