స్థానిక ఎన్నికలను మరో రెండు నెలల్లో నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెలతో మున్సిపాలిటీల పదవికాలం కూడా ముగుస్తుంది. ఇప్పుడు వారంతా మళ్లీ తమను ప్రజాప్రతినిధులను చేసే పార్టీల కోసం వెదుక్కుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలోమంటూ అందరూ ఆ పార్టీలో చేరిపోయి స్థానిక ఎన్నికలలో పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీతో సాధ్యం కాదని ఇతర పార్టీలను చూసుకుంటున్నారు.
కరీంనగర్ మేయర్ పది మంది కార్పొరేటర్లతో కలిసి బీజేపీలో చేరిపోతున్నారు. గ్రామాల్లో అత్యధికంగా ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొంత మంది చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది మున్సిపల్ స్థాయి నేతలు కాంగ్రెస్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు కొంత మంది బీజేపీ వైపు చూస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో బీఆర్ఎస్ నుంచి క్యాడర్ వలస చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకం. పార్లమెంట్ ఎన్నికల నాటి ఓటు బ్యాంకే వచ్చినా.. అంత కంటే తక్కువ వచ్చినా పరిస్థితి మరింత విషమిస్తుంది. సోషల్‌మీడియాను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ చేస్తున్న యుద్ధంలో పస లేదన్న భావన వస్తుంది. అందుకే పార్టీ క్యాడర్ ను కాపాడుకుని స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. పోటీ కాంగ్రెస్,బీజేపీ ల మధ్య కనిపిస్తే ..బీఆర్ఎస్ ఓటు బ్యాంకు అంతా బీజేపీకి షిఫ్ట్ అయిందన్న భావన వస్తుంది. అదే జరిగితే జరగరాని నష్టం జరుగుతుంది.