కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు. కవిత ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. కేటీఆర్ తీరు చూస్తూంటే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. డ్రైవర్లు అంతా ఇలా అయిపోతే ఇక బీఆర్ఎస్ కారు ఎటు పోతుంది ?. అదే బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడంలేదు. ఓ పద్దతి లేకుండా చేస్తున్న రాజకీయంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితులు వస్తున్నాయి.
పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించడంతో కౌశిక్ రెడ్డి చేసిన వ్యవహారం.. హరీష్ చేసిన చేసిన రచ్చ చేసిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ కిందా మీదా పడుతోంది. ఎంతగా ఉంటే… గాంధీని కూడా చిన్న మాట అనేందుకు హరీష్ రావు సిద్ధపడటం లేదు. కౌశిక్ రెడ్డి తాను గాంధీనే అన్నానని ఆంధ్రోళ్లను అనలేదని పదే పదే చెప్పుకుంటున్నారు. కానీ ఆయనేమన్నాడో ఇప్పటికే అందరికీ స్పష్టత ఉంది.
ఈ విషయంలో బీఆర్ఎస్ వ్యూహం ప్రకారం చేసిందేమీ లేదు. గాలి ఎటు వస్తే అటు కొట్టుకుపోయినట్లుగా రాజకీయం చేస్తున్నారు. చివరికి అది పార్టీకే డ్యామేజ్ చేస్తోంది. కేసీఆర్ రోజువారీ పార్టీ వ్యవహారాలను పట్టించుకునేందుకు సిద్ధంగా లేరు. కేటీఆర్ ఇక్కడ లేరు. హరీష్ రావు… ఎక్కువగా సిద్దిపేటకు పరిమితమవుతున్నారు. బాధ్యత ఉంది కాబట్టి ఫోర్సుడ్ ఆయన రాజకీయం చేస్తున్నారు. తనకు రావాల్సిన పీఏసీ కోసం కౌశిక్ రెడ్డి రాజకీయం కోసం హరీష్ ముందుకు వచ్చారు కానీ.. ఆయన దూకుడుతో తనకూ చిక్కులు వస్తాయని హరీష్ భావించలేదు.
కారణం ఏమిటో తెలియదు కానీ.. బీఆర్ఎస్ ఇప్పుడు పైలెవల్ లోనే నాయకత్వం లోపం స్పష్టం గా కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు ఈ అడ్వాంటేజ్ ను వాడుకుని చేయాల్సినంత గోల చేస్తున్నారు. చివరికి ఈ కారును తీసుకెళ్లి ఎక్కడ యాక్సిడెంట్ చేస్తారో అని క్యాడర్ కూడా ఆందోళన చెందుతున్నారు.