బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు, మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలవడం తెలంగాణా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబుని కలిసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి చేసిన కామెంట్స్ పై పెద్ద చర్చే జరుగుతోంది. తన పాటుగా చాలా మంది సిద్దంగా ఉన్నారని త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని కృష్ణారెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఆయన వెనుకే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి మల్లన్న తరుపున కృష్ణన్న ఓ క్లారిటీ ఇచ్చారు పార్టీ మారే విషయంలో.
నేను మారడం లేదనో, మారుతున్నా అనో చెప్పకుండా మల్లారెడ్డి వెళ్ళిపోయారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి అయితే… మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా వీళ్ళతో పాటు వెళ్ళారు. గతంలో కూడా మాధవరం, తెలంగాణా ఎమ్మెల్యేల లేఖలు తిరుమలలో అనుమతించాలని కోరేందుకు వెళ్ళారు. వీళ్ళల్లో క్లారిటీ ఇచ్చింది ఒక్క తీగల మాత్రమే. దీనితో వీళ్ళ చేరిక త్వరలోనే ఉంటుందని, తెలంగాణాలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి చేరతారు అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఉన్నపళంగా వీళ్ళు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.
ఇది కచ్చితంగా ప్రీ ప్లాన్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. త్వరలో తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలు పార్టీలకు చాలా కీలకం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడానికి మూసిని, హైడ్రాను అడ్డం పెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. అందుకే మూసి విషయంలో కేటిఆర్, హరీష్ పట్టుదలగా ఉన్నారు. ఇక్కడే బిజేపి, టీడీపీ కూటమి పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ గ్రేటర్ పీఠాన్ని అందుకోవడం సాధ్యం కాదనే భావన ఉంది.
హైడ్రా, మూసీ విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం ఉంది. అందుకే బీజేపి, టీడీపీ తమ రాజకీయాన్ని మొదలుపెట్టాయి. తెలంగాణాలో కచ్చితంగా టీడీపీ, బిజేపి పొత్తు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుని కలిసిన నేతలు బీజేపిలో జాయిన్ కావడం కంటే టీడీపీలో జాయిన్ అవ్వడమే ఉత్తమం. వారి వారి నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. చంద్రబాబు విషయంలో బిజెపి వైఖరి మారడంతో ఆ క్యాడర్ కూడా బిజేపిపై పెద్ద కోపంగా లేదు. టీడీపీ బరిలో ఉంటే మాత్రం కచ్చితంగా వాళ్ళు టీడీపీ కోసం పని చేయవచ్చు.
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బిజెపి కలిస్తే… కాంగ్రెస్ కంటే నష్టం బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ. హైదరాబాద్ లో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం టీడీపీ నుంచి వెళ్ళిందే. క్యాడర్ మొత్తం వాళ్ళతోనే ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ వేయడం మొదలుపెట్టారు. గ్రేటర్ పీఠం ఎప్పుడూ అధికార పార్టీలదే కాబట్టి కచ్చితంగా కాంగ్రెస్ సొంతం చేసుకోవచ్చు అనే భావన కూడా ఉంది. కాని గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు కూడా రెండో స్థానంలో నిలబడాలని బిజెపి పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపి కలవలేదు. ఇప్పుడు కలుస్తున్నాయి కాబట్టి మేయర్ పీఠం కైవసం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత మంది పార్టీ మారతారు అన్నదే ఇప్పుడు ఆసక్తిని రేపే అంశం. పనిలో పనిగా తలసాని శ్రీనివాస్ కు, మాగంటి గోపీనాథ్ కు కూడా గురిపెట్టారని టాక్.