టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యూహమేంటో అర్థం కావడం లేదు..! ఆ అంశాన్ని ఆయన ఒక్కరే మాట్లాడుతున్నారు. అధికార పార్టీలో మరెవ్వరూ దాని గురించి పట్టించుకోవడం లేదు. అయినాసరే, అదే అంశాన్ని మళ్లీ తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేశారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన హామీలూ టీడీపీ పోరాటం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై ఆయన మరోసారి విమర్శలు చేశారు. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుండటం దారుణం అన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టిన గతే వైకాపా, భాజపాలకి పడుతుందని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు..! ఆ రెండు పార్టీల మధ్యా రహస్య ఒప్పందం కుదిరిందనీ, ప్రజలను మోసం చేసే విధంగా ఇద్దరూ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం ఇంతగా కక్ష సాధింపులు చేస్తుంటే.. జగన్ ఇంతవరకూ భాజపాని విమర్శించకపోవడం ఆ ఒప్పందంలో భాగమే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఆర్థిక నేరస్థుడైన జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తురన్నారు. అంతవరకూ బాగానే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మైనారిటీల పక్షాన’ నిలుస్తున్నారనీ, అందుకే ఆయన్ని అణగదొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు..!
మైనారిటీల పక్షాన నిలవడం అనే ఈ యాంగిల్ ఏంటో అర్థం కావడం లేదు..! రాష్ట్ర నేతలంతా భాజపాపై విమర్శలు చేస్తున్నారుగానీ.. ఈ కోణంలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఇలా మాట్లాడటం ఇది రెండోసారి. కొద్దిరోజుల కిందట ఓ ప్రెస్ మీట్ లో కేంద్రాన్ని విమర్శిస్తూ… ముస్లింల తరఫున సీఎం పోరాటం చేస్తున్నారనీ, దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. ఇంతకీ, ప్రస్తుత అంశాలతో దేనికీ సంబంధం లేని మైనారిటీల ప్రస్థావన ఎందుకు తీసుకొస్తున్నారయ్యా అని అప్పుడే విలేకరులు అడిగారు. ‘కొన్ని విషయాలు చెప్పాల్సిన పనిలేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది, మున్ముందు అన్నీ తెలుస్తాయ’ని అన్నారు. కనీసం ఇప్పుడైనా ఆ క్లారిటీ ఇవ్వలేదు. బుద్ధా వెంకన్న వ్యాఖ్యల్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంటోందా అనేదే అనుమానం. లేకుంటే, ఆ మైనారిటీ అజెండా ఏంటో ఇప్పటికైనా బయటపడాలి కదా..!