ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి. అసెంబ్లీ ఆమోదం తీసుకోవాలి. ఎలా ఖర్చు పెడుతున్నామో.. రాజ్యాంగ సంస్థ అయిన కాగ్‌కు నెలా నెలా లెక్కలు చెప్పాలి. అన్ని ప్రభుత్వాలూ అలానే చేస్తాయి. కానీ ఒక్క ఏపీ ప్రభుత్వమే భిన్నం. ఎలా ఖర్చుపెడుతుందో..ఎక్కడ అప్పులు తెస్తుందో.. ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. చివరికి కాగ్‌కు కూడా చెప్పడం లేదు.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు ఏపీ కి సంబంధించి కేవలం ఒక్క ఏప్రిల్ నెల లెక్కలు మాత్రమే కాగ్ ఆన్ లైన్లో పెట్టింది. తెలంగాణ లెక్కలు మాత్రం జూన్వి కూడా క్లియరైపోయాయి. ఏపీ మాత్రం ఎందుకు పెట్టలేదంటే… తమకు సమాచారం రాలేదని కాగ్ వర్గాలు చెబుతుతున్నాయి.. రాష్ట్ర ఖజానాకు సంబంధించిన నెలవారీ లెక్కలపై కాగ్ మళ్లీ వివరాలు కోరినట్లు తెలిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదో నెల గడుస్తున్నా, ఇంకా తొలి నెల లెక్కలు కూడా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తుది లెక్కలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. లెక్కలకు సంబంధించిన వివరాల పెండింగ్‌పై పదేపదే కాగ్, ఎజి కార్యాలయాల నుంచి రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖలు వచ్చిస్తున్నాయి. ప్రధానంగా రుణాలు, గ్యారెంటీల వివరాలు సిద్ధం చేయడంలో నెలకొంటున్న సందిగ్ధమే ఈ జాప్యానికి కారణంగా ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేస్తే.. కాగ్ సీరియస్‌గా స్పందిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని అవకతవకలు జరుగుతున్నా.. చూసీ చూడనట్లుగా ఉంటోంది. ఏపీ సర్కార్‌కు ఇంత ప్రివిలేజ్ ఏమిటబ్బా అని ఢిల్లీ వర్గాలు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.