ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారుతోంది. ఢాకా తర్వాత స్థానంలో ఢిల్లీనే ఉంది. అందుకే ఇంకా దేశ రాజధానిగా ఢిల్లీనే ఉంచుతారా అని కాంగ్రెస్ నేత శశిథరూర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటించాలని అంటున్నారు. ప్రతీ ఏడాది కాలుష్యం అనేది పెద్ద సమస్య అయిపోయింది. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యం కాదని.. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించడం కరెక్ట్ కాదిని శశిథరూర్ వాదిస్తున్నారు.
శశిథరూర్ ట్వీట్‌కు స్పందిస్తున్న వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌ను రాజధానిగా కోరుకుంటున్నారు. గతంలో రెండో రాజధాని హైదరాబాద్ అనే వాదన వినిపించింది. అది ఇప్పటిది కాదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ఈ వాదన తెచ్చారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే నగరం హైదరాబాద్. వాతావరణ పరంగానే కాకుండా స్ట్రాటజిక్‌గా కూడా హైదరాబాద్ రక్షణ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది రాజకీయంగా సున్నితమైన అంశం. రెండో రాజధానిగా చేస్తే తెలంగాణ నుుంచి వేరు చేసినట్లుగా రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లీకి బదులుగా కనీసం నాలుగు నెలల పాటు అయినా వేరే నగరాన్ని రాజధానిగా ప్రకటించి పాలన చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నగరం హైదరాబాద్ ఎందుకు కాకూడదనేది ఎక్కువ మంది వాదన. ఢిల్లీ కాలుష్యం .. ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది కానీ అరికట్టలేకపోతున్నారు. ప్రజల్ని బయటకు రావొద్దని చెప్పేంత స్థాయిలో కాలుష్యం వస్తే ఇక ప్రత్యామ్నాయం చూసుకోక తప్పని పరిస్థితి ఏముంటుంది ?