ప్రస్తుతం వైసీసీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టంతా అధికారంపైనే ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు! సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు టైమ్ ఉన్నా కూడా… ప్రతిపక్ష పార్టీ పాత్రను జగన్ వదిలేస్తున్నారు! తాజా ప్లీనరీలో అదే స్పష్టమైంది. 2019 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించేశారు. ఎన్నికల్లో గెలవాలీ, అధికారంలోకి రావాలి అంటున్నారే తప్ప.. మరో రెండేళ్లపాటు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఏం చేయబోతున్నారనేది చెప్పలేకపోతున్నారు! ప్లీనరీలో వైకాపా నేతలు అందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలకే పరిమితం అయ్యారు. ఇదే క్రమంలో భాజపాకి దగ్గరయ్యే ధోరణిలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం చెయ్యలేకపోయారు! జగన్ గానీ, షర్మిలగానీ, ఇతర నేతలుగానీ మాట్లాడిన తీరు చూస్తే.. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్నే ఎండగట్టారు తప్ప, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఎక్కడా తప్పుబట్టేలా మాట్లాడలేదు! ఈ క్రమంలో ప్రత్యేక హోదా గురించి కూడా గట్టిగా మాట్లాడలేకపోయారు!
ప్రత్యేక హోదా సాధించే వరకూ వైకాపా పోరాటం చేస్తుందనీ, అవసరమైతే ఎంపీలు రాజీనామాలు చేసేందుకు కూడా వెనకాడరని జగన్ తరచూ చెబుతున్నమాటే. అంతేకాదు, అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని కూడా ఈ మధ్య చెబుతూ వచ్చారు. అయితే, ఈ మధ్య భాజపాతో దోస్తీ కుదురుతున్నట్టు అనిపించడం.. ప్రధానమంత్రితో జగన్ మిలాకత్, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జగన్ నయా దోస్తీ, స్వామి భక్తి ప్రదర్శన.. ఈ పరిణామాలన్నీ కలిసి ప్లీనరీలో హోదాపై గట్టిగా మాట్లాడకుండా చేశాయనడంలో సందేహం లేదు! అంతెందుకు.. జగన్ గొప్పగా చెప్పిన ఆ తొమ్మిది హామీల్లో ప్రత్యేక హోదా ఎక్కడుంది..? దాని ప్రస్థావన ఎందుకు లేదు..?
నామ్ కే వాస్తే అన్నట్టుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా… ఆ హామీని చంద్రబాబు నెరవేర్చలేకపోయారనే విమర్శించారు. టీడీపీ ఫెయిల్యూర్ అన్నట్టుగానే మాట్లాడారు, అంతేగానీ ఇచ్చిన మాటకు నిలబడని భాజపా గురించి ప్రస్థావించకపోవడం గమనార్హం! కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం జగన్ చేయలేకపోయారు. పరిస్థితి ఇలా మారిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉరకలు వేయించేస్తామని ఢంకా బజాయించుకున్న వైకాపా కూడా… ఇప్పుడు భాజపాతో చెలిమి కోసం ఆ మాటను అటకెక్కించేస్తోందనే అనిపిస్తోంది. హోదా అంశం తనకు గుర్తుందనీ పైపైన చెప్పుకుంటూ జగన్ దాటేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదాను పణంగా పెట్టారని విమర్శించిన పెద్ద మనుషులు వీరే కదా! ఇప్పుడు భాజపాతో దోస్తీ కోసం క్రమంగా ప్రత్యేక హోదా పోరాటానికి నీళ్లు వదిలేస్తున్నారు. దీన్నేమంటారు..? ఏ ప్రయోజనం కోసం భాజపా దోస్తీ కోసం వెంపర్లాడుతున్నారు..? ఏ ప్రయోజనం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చే విధంగా మాట్లాడుతున్నారు..? ఆ తొమ్మిది హామీలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేకపోయారో చెప్పగలరా..?