తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వాదాన్ని వదిలేసింది. ఇప్పుడు తమది అంతా జాతీయ వాదం అని భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చేశారు. తమ పార్టీ దేశం అంతా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏపీలోనూ క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్ కిసాన్ సెల్ శాఖను పెట్టబోతున్నారు. ఇలాంటప్పుడు ఇక ఇతర పార్టీలు తెలంగాణలోకి వస్తే.. నిందించడం.. తమను తాము తక్కువ చేసుకోవడమే. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అదే చేస్తున్నారు. గతంలో టీడీపీపై ఆంధ్రాపార్టీ అనే ముద్ర వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నే ఏపీలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.కానీ టీడీపీ మాత్రం తెలంగాణలో వద్దంంటున్నారు.
ఖమ్మం బహిరంగసభ తర్వాత తెలంగాణ రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది. బీఆర్ఎస్ నేతలు మాత్రం టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తప్ప ఇంకెవరూ టీడీపీ సభపై అటు పాజిటివ్ గా కానీ.. ఇటు నెగెటివ్ గా కానీ స్పందించలేదు. చంద్రబాబునాయుడు ఖమ్మం బహిరంగసభలో పార్టీని వీడిన పాత నేతలందర్నీ కలసి రమ్మన్నారు. టీడీపీ బలపడితే ఆ మేరకు తమకే నష్టం జరుగుతుందనే అంచనాకు బీఆర్ఎస్ రావడంతోనే ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టీడీపీ యాక్టివ్ అయితే ఎఫెక్ట్ అయ్యే పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకూ టీడీపీ సానుభూతి పరులపై ఆశలు పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు రాజకీయాలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుపై అభిమానం చూపుతారు. దీనికి కారణం.. తెలంగాణలో డీలాపడిపోయిన టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తన వైపు ఉంచుకోవడమేనని చెబుతూంటారు. తెలుగుదశం పార్టీలో చేరిన వారు బీఆర్ఎస్లో చేరగా. మిగిలిన వారు చాలా మంది టీ బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల వైపు వెళ్లలేని కొంత క్యాడర్ కూడా బీజేపీ వైపు మొగ్గింది. ఇప్పుడు టీడీపీ యాక్టివ్ అయితే.. ఆ మేరకు క్యాడర్ టీడీపీకి తిరిగి వస్తే రెండు పార్టీలకూ నష్టమే.
అయితే టీడీపీ తెలంగాణలో బలపడిపోయి అధికారం చేపడుతుందని. ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఎంతో కొంత ఓటు బ్యాంక్ ను మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటుందని నమ్ముతున్నారు. గత చరిత్ర దృష్ట్యా చూస్తే.. టీడీపీని తక్కువగా అంచనా వేయలేరు. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లకు గట్టిపోటీ ఇవ్వవొచ్చన్న అంచనా ఉంది. అయితే టీడీపీ చీల్చే ఓట్లే కొన్ని రాజకీయ పార్టీల గెలుపోటములని తారుమారు చేయవచ్చన్నది ఎక్కువ మంది అంచనా. ఇదే ఇప్పుడు కీలకం అవుతోంది.