సర్దార్ గబ్బర్‌సింగ్, దంగల్ సినిమాల్లో ఉన్న కంటెంట్ ఏంటి? రెండింటిలో ఏది గొప్ప సినిమా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళకు గొప్ప కాబట్టి. నేను విన్న అన్ని పాటల్లోకి ‘వై దిస్ కొలవెరీ’నే గొప్ప పాట అని ఒకరు చెప్పొచ్చు. కాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటే గొప్పది అని ఇంకొకరు చెప్పొచ్చు. అందుకని ఆ డిబేట్‌ని పక్కన పెట్టేద్దాం. కానీ అమీర్ ఖాన్, పవన్ కళ్యాణ్‌లు చేసిన ఓ ప్రయత్నం గురించి మాట్లాడుకుందాం. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో హిందీలో కూడా కాస్త మార్కెట్‌ని క్రియేట్ చేసుకుందామని ట్రై చేశాడు పవన్. గబ్బర్‌సింగ్ పేరు హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉండడం, అలాగే సింగం, దబంగ్లాంటి రెగ్యులర్ సౌత్ మసాలా ఉన్న సినిమాలను కూడా హిందీ ప్రేక్షకులు ఆదరించి ఉండడంతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా హిందీవాళ్ళకు నచ్చుతుందన్న నమ్మకంతో హిందీలో రిలీజ్ చేశాడు పవన్. ప్రపంచంలో ఉన్న ఏ మనిషి చేసే అన్ని ప్రయత్నాలు కూడా ఎప్పుడూ సక్సెస్ అవ్వవు. అలానే పవన్ ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. సర్దార్ సినిమా ఫ్లాప్ అయింది. సినిమాలు ఫ్లాప్ అవ్వడం అనేది సర్వసాధారణం. కానీ రామ్ గోపాల్ వర్మతో పాటు చాలా మంది మీడియా వాళ్ళు కూడా చరిత్రలోనే ఫస్ట్ టైం ఓ సినిమా ఫ్లాప్ అవ్వడమన్న అద్భుతం జరిగింది అనే రేంజ్లో రెచ్చిపోయారు. బాహుబలితో వచ్చిన పేరంతా సర్దార్తో పోయిందని ఏకిపడేశారు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ విమర్శల ప్రభావం ఏ రేంజ్లో ఉందంటే మళ్ళీ ఇంకెప్పుడూ పవన్ కళ్యాణ్‌తో సహా తెలుగు స్టార్ హీరోలెవ్వరూ కూడా వాళ్ళ సినిమాలను హిందీలో రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేకపోవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు మురుగదాస్, మహేష్ చేస్తున్న సినిమాని కూడా బాలీవుడ్లో రిలీజ్ చేసే విషయంలో చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఏ స్టార్ హీరో అయినా సరే… కాసింత ఎక్కువ పేరు, కొంచెం ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుందామని వేరే భాషల్లో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అంతే కానీ ఉన్న పేరు పోగొట్టుకోవడానికి, వెటకారం అయిపోవడానికి కాదు కదా. రామ్ గోపాల్ వర్మతో పాటు మన తెలుగు మీడియాలో ఉన్న క్రిటిక్స్ అందరూ కూడా తెలుగు స్టార్ హీరో సినిమాని తెలుగుకు పరిమితం చేసి గొప్ప విజయం సాధించారు.
సర్దార్ సినిమాకి ముందు తెలుగులోకి డబ్ అయిన ఎన్నో తమిళ సినిమాలు, హిందీ సినిమాలు కూడా డిజాస్టర్స్ అయ్యాయి. అందులో మణిరత్నం లాంటి గొప్ప దర్శకులు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయిన ‘దంగల్’ సినిమా కూడా డబ్బింగ్ వెర్షన్ వరకూ చూసుకుంటే మాత్రం డిజాస్టర్ అయింది. కనీసం కోటి రూపాయలు టచ్ చేసే పరిస్థిలు కూడా లేవు. దంగల్ సినిమా హిందీలో సూపర్ హిట్ అయింది, సౌత్‌లో వేరే సినిమాలేవీ పోటీలో కూడా లేవు…. అయినప్పటికీ తెలుగు, తమిళ్ భాషల డబ్బింగ్ వెర్షన్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దంగల్ సినిమా కోసం తెలుగు, తమిళ్ భాషల్లో చాలా ఎక్కువ ప్రచారమే చేశాడు అమీర్ ఖాన్. తన స్థాయిని తగ్గించుకుని మరీ రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఓ రేంజ్లో పొగిడేశాడు. ఆ ప్రయత్నాలేవీ కూడా వర్కవుట్ అవ్వలేదు. మరి అమీర్ ఖాన్ని కూడా పవన్‌ని విమర్శించినట్టుగానే విమర్శించేద్దామా? సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చలేదు కాబట్టి సినిమా బాగా లేకనే హిందీ ప్రేక్షకులు కూడా తిరస్కరించారని చెప్పొచ్చు. కానీ దంగల్ సినిమా మాత్రం హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. మరి ఆ కోవలో ఆలోచిస్తే అమీర్ ఖాన్ అనే నటుడినే తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారని చెప్పాలా? ఇక్కడ దంగల్ సినిమాని, అమీర్ ఖాన్ని తగ్గించే ప్రయత్నాలు ఏమీ చెయ్యడం లేదు. కానీ సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా విషయంలో వ్యక్తిగత ద్వేషాన్ని చూపించారన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నాం అంతే. అందుకే కమాల్ ఆర్ ఖాన్ లాంటి అమ్ముడుపోయే జాతికి చెందిన మనిషికి డబ్బులిచ్చి మరీ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తెలుగు సినిమా పరిశ్రమకు కూడా నష్టం చేశారు. సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోతున్న దృష్ట్యా మార్కెట్‌ని పెంచుకోవాలన్న ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్న మన తెలుగు స్టార్ హీరోల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేశారు. జనతా గ్యారేజ్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మన్యం పులి సినిమా తెలుగులో ఫ్లాప్ అయితే అది పెద్ద న్యూస్ అవ్వలేదుకానీ జనతా గ్యారేజ్ సినిమా మలయాళంలో ఫ్లాప్ అయిందని మాత్రం ఆటాడేసుకున్నారు.
ఫైనల్‌గా చెప్పే విషయం ఒక్కటే. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాగాలేదని విమర్శించడంలో తప్పే లేదు. కానీ బాలీవుడ్లో కూడా రిలీజ్ చేయాలన్న పవన్ ప్రయత్నాన్ని విమర్శించడం మాత్రం ముమ్మాటికీ తప్పే. సర్దార్ అయినా, జనతా గ్యారేజ్ అయినా…లేక వేరే ఏ సినిమాని అయినా కూడా, మేకింగ్ ఖర్చులు పెరిగిపోతున్న దృష్ట్యా, వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయాలనుకోవడం మంచిదే. సరైనోడు లాంటి ఊరమాస్ సినిమా కూడా మలయాళంలో హిట్ అయిందిగా. మార్కెట్ పరిధిని, బిజినెస్ రేంజ్‌ని పెంచుకోవాలన్న ప్రయత్నాలను విమర్శించడం వందశాతం కరెక్ట్ కాదు. ఇకముందు అయినా సర్దార్ విషయంలో చేసిన తప్పును రిపీట్ చేయకుండా ఉంటారని, ఉండాలని కోరుకుందాం.