ఇంగ్లిష్ మీడియం పెట్టండి.. కానీ తెలుగు మీడియాన్ని రద్దు చేయవద్దని అన్నందుకు.. విపక్షాలు, మీడియాపై కులపరమైన ఆరోపణలు చేసి.. పేదలకు ఇంగ్లిష్ చదువులు వద్దంటున్నారని.. విమర్శలు చేశారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు హైకోర్టు కూడా.. చాలా గట్టిగా.. అదే విషయాన్ని చెబుతోంది. మాతృభాషలో చదువును ఎలా నిరాకరిస్తారని ప్రశ్నిస్తోంది. దీన్ని సమర్థించుకోవడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఎనిమిదో తరగతి వరకూ.. మాతృభాషలోనే చదువుకునే అవకాశం కల్పించాలంటూ.. ఉన్న విద్యాహక్కు చట్టాన్ని ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తోందని దాఖలైన పిటిషన్లపై..విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని.. హైకోర్టు అభిప్రాయపడింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో.. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. హైకోర్టుకు నిజాలు చెప్పలేక ఇబ్బంది పడుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలని స్పష్టమైన జీవో ఇచ్చి.. ఆ విషయాన్ని హైకోర్టుకు చెప్పలేక.. అడ్వకేట్ జనరల్ తిప్పలు పడుతున్నారు. మరో పది రోజులు గడువు ఇస్తే పూర్తి ప్రమాణపత్రం సమర్పిస్తామని.. మాతృభాషలో చదువుకోవడాన్ని నిరాకరించడం లేదని.. వాదించారు. గడువులోగా ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే.. ఇంగ్లిష్ మీడియం అమలుపై స్టే ఇచ్చేందుకు వెనుకాడబోమని.. హైకోర్టు ఏజీకి స్పష్టం చేసింది.
హైకోర్టు విచారణలో ఉండగానే నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తే.. అధికారులే బాధ్యులవుతారని.. హైకోర్టు స్పష్టం చేసింది. పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణా తరగతుల నిర్వహణకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే ఏసీబీ, సీబీఐ విచారణకు ఆదేశించి డబ్బును వెనక్కి రప్పిస్తామని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చట్ట విరుద్ధంగా.. తన నిర్ణయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందన్న విషయం .. బయట పడుతోంది. ఎలా చూసినా.. ఇంగ్లిష్ మీడియం అమలు సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తెలుగుమీడియం కూడా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి దీనిపై.. వైసీపీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తుందేమో చూడాలి..!