అవినాష్ రెడ్డి అరెస్టే మిగిలిందంటూ హడావుడి చేశారు కానీ ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయారు. సీబీఐ ఎప్పుడైనా అరెస్ట్ చేస్తుందన్న ఆందోళనతో అవినాష్ రెడ్డి ఎడతెగని విధంగా న్యాయపోరాటం చేశారు. లంచ్ మోషన్ పిటిషన్స్ దగ్గర్నుంచి అన్ని రకాల న్యాయపోరాటాన్ని చేశారు. చివరికి ఆయనకు ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. అడ్డంకులు లేకపోతే అరెస్టేనని సీబీఐ కూడా హంగామా చేసింది. కానీ చివరికి ఎలాంటి ఆటంకాలు లేకపోయినా పట్టించుకోవడం లేదు.
పారిపోయాడని జనం అనుకోకుండా.. అలాగే అరెస్ట్ చేస్తే..సానుభూతి పొందడానికి ప్రజల మధ్యే అవినాష్ రెడ్డి ఉంటున్నారు. అవినాష్ రెడ్డి అత్యధిక సమయం పులివెందులలోనే గడుపుతున్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచిన వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అరెస్టుకు కూడా మానసికంగా రెడీ అయిపోయినట్లుగానే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని బెయిల్పై వచ్చేస్తారని ఆయనతో సన్నిహితంగా ఉండే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఇప్పటికే ప్రకటించారు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అన్నది సీబీఐ ఇష్టం. ఈ మేరకు దర్యాప్తు సంస్థలకు న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవు. దర్యాప్తు అధికారిని సుప్రీంకోర్టు మార్చిన తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయిన సీబీఐ..తర్వాత పంజా విసిరింది. హఠాత్తుగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. తర్వాత మళ్లీ ఇప్పుడు కాస్త నెమ్మదించింది. అయితే సీబీఐ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని.. అవినాష్ రెడ్డితో పాటు ఇంకా కీలకమైన వ్యక్తుల గురించి ఆరా తీయడానికే సమయం కేటాయిస్తోందని అంటున్నారు.