హైకోర్టు తీర్పు అలా వచ్చిన మరుక్షణం ఇలా సీబీఐ విరుచుకుపడటం చాలా సార్లు చూశాం. కానీ విచిత్రంగా ఈ సారి సీబీఐ … ఫామ్ హౌస్ కేసును తీసుకోమని చాలా సార్లు కోర్టు చెప్పినప్పటికీ ఇంకా ఫైల్స్ కావాలని లేఖలు రాస్తూనే ఉంది. ఒకటి కాదు…. రెండు కాదు ఏకంగా ఐదు సార్లు లేఖలు రాశామని మీడియాకు లీక్ ఇచ్చింది. కానీ అంతకు మించి ఏమీ చేయలేమన్నట్లుగా ఉండటం… అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
సీబీఐకి వివరాలు ఇవ్వకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఈ విషయంలో సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కొత్త చీఫ్ సెక్రటరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. నిజానికి సీబీఐ ఇప్పటికే కోర్టును ఆశ్రయించాల్సి ఉంది. అలా చేయలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. కోర్టు ను కాదనే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. సీబీఐ చేతికి కేసు వెళ్తే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు చెబుతున్నారు.
ఇప్పుడు సీబీఐ తెలంగాణతో సంబంధం లేకుండా.. ఢిల్లీలో కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ దిశగా సీబీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు సుప్రీంకోర్టులో ఈ కేసు పదిహేడో తేదీన విచారణకు రానుంది. అప్పటి వరకూ సీబీఐ ఎదురు చూస్తుందా లేకపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసి రంగంలోకి దిగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. చేయాలనుకుంటే వెంటనే రంగంలోకి దిగుతుంది.