ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడానికి డిల్లీ వెళ్ళిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలని కలవాలనుకొన్నారు. కానీ వారు ఏవో కారణాలు చెప్పి ఆయనకి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తప్పించుకోవడం విశేషం. అదే ఇదివరకు తెదేపా-భాజపాల మద్య విభేదాలు మొదలైనప్పుడు వారిరువురూ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన పిర్యాదులన్నీ శ్రద్దగా విని, చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారంటూ వైకాపా ప్రచురించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే పుస్తకాన్ని కూడా నిరభ్యంతరంగా స్వీకరించారు.
అప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ వారి ఆలోచనలలో చాలా మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడుతో విభేదించి రాష్ట్రంలో భాజపాకి నష్టం కలిగించుకోవడం కంటే ఆయన కోరినట్లుగానే ఏపికి ప్రత్యేక హోదా లేదా ఆర్ధిక ప్యాకేజి ఇచ్చి ఆయనతో రాజీపడటమే మేలని కేంద్రప్రభుత్వం భావిస్తోందిప్పుడు. బహుశః అందుచేతే ఈసారి కేంద్రమంత్రులు ఇద్దరూ జగన్మోహన్ రెడ్డిని దూరంపెట్టి ఉండవచ్చు. ఇది ఆయనకి చాల నిరాశ కలిగించి ఉండవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులలో ఏమీ చేయలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏమి ఇవ్వబోతోందో తెలిస్తే తప్ప వైకాపా కూడా తన కార్యాచరణని నిర్ణయించుకోలేదు. కనుక జగన్ మరికొన్ని రోజులు ఓపికగా ఎదురుచూడక తప్పదు.