తెదేపా-భాజపాలు మిత్రపక్షాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములు. అయితే వాటి మధ్య స్నేహ సంబంధాలు అంతంత మాత్రమేనని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 100 అడిగితే మోడీ ఒక రూపాయి విదిలిస్తుంటారు. రెండు పార్టీల మధ్య ఉండవలసినంత సహకారం లేకపోవడం వలననే ఆవిధంగా జరుగుతోందని చెప్పవచ్చును. కానీ అందుకు సాంకేతిక కారణాలు కూడా చాలానే ఉన్నాయని సర్దిచెప్పుకోక తప్పదు.
అయితే 2014 ఎన్నికల ప్రచార సమయంలో దేశంలో ఆర్ధిక నేరస్తులందరికీ ఏరి పారేస్తామని హూంకరించిన నరేంద్ర మోడీ ఆ తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. ముఖ్యంగా మిత్రపక్షమయిన తెదేపా ప్రభుత్వానికి పక్కలో బల్లెంలాగ తయారయిన జగన్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఏపిలో కూడా భాజపా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటోంది కనుక చంద్రబాబు నాయుడుకి పక్కలో బల్లెం ఉంచవలసిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతోనే జగన్ని చూసి చూడనట్లు వదిలేసిందేమోననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంతగా రెచ్చి పోతున్నా చంద్రబాబు నాయుడు కూడా ఏమీ చేయలేకపోతున్నారనుకోవలసి ఉంటుంది.
అదే భాజపాకి రాష్ట్రంలో పెద్ద ఆలోచనలేవీ లేకపోయినట్లయితే, చంద్రబాబు నాయుడుకి జగన్ విషయంలో కూడా పూర్తి సహకరించి ఉండేదేమో? ఈ విషయం బహుశః జగన్ కూడా గ్రహించినట్లే ఉన్నారు అందుకే ఆయన ఎప్పుడూ తన తుపాకీని చంద్రబాబు నాయుడు మీదే గురిపెడుతుంటారు తప్ప పొరపాటున కూడా డిల్లీ వైపు గురిపెట్టారు. భాజపా, వైకాపాల మధ్య నెలకొనున్న ఈ కనబడని అవగాహనను చంద్రబాబు నాయుడు కూడా బాగానే అర్ధం చేసుకొన్నట్లున్నారు. అందుకే ఆయన వైకాపాని ఖాళీ చేసే పనిలో పడినట్లున్నారు. వచ్చే ఎన్నికలలోగా దానిని క్లీన్ చేసేయాలనుకొంటున్నట్లు బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు రాష్ట్రంలో శాస్వితంగా తెదేపాయే అధికారంలో ఉండాలని కోరుకొంటున్నట్లు కూడా స్పష్టం చేసేసారు.
ఆయన ఇదేదో ఊసుపోక అన్నమాట కాదు కనుక గట్టిగా ప్రయత్నించి మరో 20-30 మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి రప్పించగలిగితే ఏమవుతుంది? అని ఆలోచిస్తే పరిస్థితులు అంతవరకు రానీయకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ముందే పావులు కదుపుతాడని చెప్పవచ్చును.
అవకాశం దక్కితే భాజపాతో చేతులు కలపాలనే ఆలోచనతోనే జగన్ ఇంతకాలం ఓపికగా ఎదురు చూస్తున్నారు. కానీ తన పార్టీ ఖాళీ అయిపోతున్నా కూడా భాజపా తనతో చేతులు కలిపేందుకు ముందుకు రాకపోయినట్లయితే, అతను తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా భీకర పోరాటం చేయవలసి ఉంటుంది లేదా ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపవలసి ఉంటుంది. మొదటి దాని వలన ఫలితం లేదని ఇప్పటికే స్పష్టం అయిపోయింది కనుక తప్పనిసరిగా రెండవ ఆప్షన్నే ఎంచుకోవలసి ఉంటుంది. జగన్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే సోనియా గాంధీ మొదలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల వరకు అందరూ ఆయనకు అండగా నిలబడతారు కనుక అప్పుడు తెదేపాను ఎదుర్కొని నిలబడటం సాధ్యమే. దానితో కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ రాష్ట్రంలో బలపడుతుంది.
అదే జరిగితే వచ్చే ఎన్నికలలో భాజపాకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక జగన్ అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే, కేంద్రప్రభుత్వం అటకమీద నుంచి సిబీఐ కేసులను క్రిందకు దింపవచ్చును. కనుక 2019 ఎన్నికలు సమీపించేవరకు జగన్మోహన్ రెడ్డి తెదేపాతో పోరాడుతూనే ఉండాలి. అందుకు అతనికి కూడా ఏమీ అభ్యంతరం లేదు కానీ తెదేపా భారి నుంచి తన పార్టీని రక్షించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా తెదేపాకి జగన్మోహన్ రెడ్డిని, అతనికి తెదేపాను పక్కలో బల్లెంలాగ ఉండేలా జాగ్రత్తపడుతూ భాజపా మరో ఏడాదో రెండేళ్లో లాగించేసాక అప్పటి పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకోవచ్చును.