ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే విజయవాడ ప్రాంతంలో అద్దెల గురించి, భూముల రేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి ప్రజలకు రుచించడం లేదు. రాజధాని వస్తే అభివృద్ధి వస్తుందని వూరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అద్దెలు కొంచెం పెరగ్గానే ఏదో అయిపోయినట్టు తానే ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు. భూముల లావాదేవీలు స్తంభించిపోయి అనేకమంది సంక్షోభంలో కూరుకుపోయారు. కాని సిఎం మాత్రం భూముల రేట్ల పెంపు అంటున్నారు. ఒకోసారి ఎందుకు రాజధాని అనిపిస్తుంది అని ఒక శాసనసభ్యుడన్నారు. పెట్టుబడులు ప్రవాహంలా వస్తాయని చెప్పిన ప్రభుత్వమే దీనివల్ల పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించడం న్యాయమేనా అని ఒక స్థానిక వ్యాపారి ప్రశ్నించారు. నిజంగా ఏమీ జరగడం లేదు గనక నెపం మా మీద పెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారా అని కూడా సందేహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబుకే సందేహాలు పెరిగిపోయి సాకులు వెతుకుతున్నారని మరో పరిశీలకుడు వ్యాఖ్యానించారు.
మాటలు జాగ్రత్తగా వాడకుండా పొరబాటు సంకేతాలు పంపడం రివాజుగా మారిన ముఖ్యమంత్రి ఈ రోజు ఎల్వి ప్రసాద్ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో అనవసరంగా ప్రాంతాల తేడా గురించి చెప్పారు. ఇక్కడ అద్దెలు పెరిగిపోతే పెట్టుబడులు రాయలసీమకు పోతాయని అక్కడికి పోతే వేరే రాష్ట్రాలకు పోతాయని హెచ్చరించారు. నిజంగా రాయలసీమకు పోతే విచారించాల్సిన పని ఏముంటుంది? ఇప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని అనుమానాలు, ఆందోళనలు సాగుతుంటే స్వయానా చంద్రబాబు ఇలా మాట్లాడ్డం ఉచితమేనా అని రాయలసీమకు చెందిన ఒక సీనియర్ నాయకుడు అన్నారు. ఆయన మనసులో మాట ఇలా బయిటకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఏమైనా ఆతృతలో హడావుడిలో పొరబాటు సంకేతాలు పంపుతుంటే కష్టమవుతుందని అవసరాన్ని మించి మాట్లాడ్డం, ముందుగా హౌం వర్క్ చేయకపోవడం వల్లనే ఇలాటి తప్పిదాలు జరుగుతున్నాయని పాలక పార్టీ నాయకులు కూడా అంటున్నారు.