ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ నింపాయి. ముఖ్యంగా వైయస్ ఇలాఖా కడపలో విజయం సాధించడంతో ఆ పార్టీ నేతల్లో మరింత విశ్వాసం నిండిందనే చెప్పాలి. ఇప్పుడీ విజయాన్నే ప్రధాన ప్రచారంగా మార్చుకోబోతున్నట్టున్నారు. అయితే, ఈ క్రమంలో అతి విశ్వాసానికి పోతున్నారేమో అనేట్టుగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని చంద్రబాబు అన్నారు. అంతేకాదు… రాబోయే ఎన్నికలు ఏకపక్షంగానే ఉంటాయనీ, మరోసారి ప్రజలు క్లియర్ మెజారిటీ ఇవ్వడం ఖాయం అన్నారు. అంతేకాదు… పులివెందులలో కూడా గెలిచితీరతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు అభివృద్ధి కోరుతున్నారనీ… తాము అదే అందిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు ఏం కోరుకుంటే తెలుగుదేశం అందిస్తుంటే, వేరే పార్టీ గురించి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారని చెప్పారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంచామని చేస్తున్న ఆరోపణల్లో అర్థంలేదనీ, అయినా సొమ్ము ఎవరి దగ్గర ఉందో ప్రజలకి బాగా తెలుసు అని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మొత్తానికి రెండేళ్లు ముందుగానే ఎన్నికల మూడ్ ఇంజెక్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును ప్రీఫైనల్గా భావిస్తే అతి విశ్వాసానికి పోయినట్టే. ఈ క్రమంలో కొన్ని వాస్తవాలను తెలుగుదేశం వదిలేస్తోందా అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలందరూ ఓట్లు వెయ్యరు. చాలావరకూ విద్యావంతులు వేస్తారు. వీళ్లలో పేద రైతుల ఉండరు. డ్వాక్రా మహిళలు ఉండరు. నిరుద్యోగులు ఉండరు కదా! కాబట్టి, ఒక వర్గం ఇచ్చిన తీర్పునే అశేష ఆంధ్రుల ప్రజాతీర్పుగా పరిగణించేసి ప్రచారం చేసుకోవడం అనేది అతి విశ్వాసమే.
రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదనే నిపుణులు అంటున్నారు. డ్వాక్రా రుణాల మాఫీ కూడా సోసోగానే జరిగింది. ఇక, యువత విషయానికొస్తే… నిరుద్యోగ భృతి అన్నారు. మూడేళ్లు గడిచిపోయినా ఇంకా ఆ అమలు కాలేదు. రేపోమాపో అమలు అని ఇంకా చెబుతున్నారు. ఇక, పరిశ్రమల స్థాపన అంటారా… పేపర్ల మీదే ఉంది. రాజధాని నిర్మాణమంటారా… త్రీడీ ప్రెజెంటేషన్లలోనే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒకవేళ ఇప్పుడు ప్రజాభిప్రాయం చంద్రబాబుకు పూర్తి అనుకూలంగా… ఆయన చెప్పినట్టు ఏకపక్షంగా ఉందనే అనుకుందాం. కానీ, మరో ఏడాదిన్నరలో ఇది మారదనే గ్యారంటీ ఉందా..? అప్పటి ప్రాథమ్యాలు అప్పుడుంటాయి. కాబట్టి, రాబోయే ఏడాదిన్నర చంద్రబాబు ఫోకస్ చేయాల్సింది నాటి హామీల మీద. అంతేగానీ, ఇప్పట్నుంచే ఎన్నికల మూడ్ తీసుకొచ్చేట్టు మాట్లాడితే పరిస్థితి మరోలా పరిణమించే అవకాశం లేకపోలేదు. ఒక్క పులివెందులనే లిట్మస్ టెస్ట్ గా భావిస్తే… ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎంతవరకూ ఉంటుందనేది కూడా చర్చనీయమే!