ప్రత్యేక హోదా విషయంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారెవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని అందరూ టక్కున చెప్తారు. ప్రతిపక్షాలు…ముఖ్యంగా వైకాపా దీని కోసం చేస్తున్న పోరాటాలతో, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీవ్ర విమర్శలతో చంద్రబాబు నాయుడు, తెదేపా నేతలు అందరూ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిజానికి ప్రతిపక్షాలు కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయవలసి ఉన్నప్పటికీ అందరూ చంద్రబాబు నాయుడునే నిలదీస్తూ ఆయననే ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలని ఎవరూ కూడా ప్రశ్నించడం లేదు. వారు కూడా తమకి ఈ సమస్యతో సంబంధం లేదన్నట్లు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే వారి అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయినప్పుడు హోదా, ప్యాకేజీల గురించి మాట్లాడకపోవడమే అందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. బహుశః అయన కూడా ఇది చంద్రబాబు నాయుడు సమస్యని భావిస్తున్నట్లున్నారు. అటువంటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యని తన నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నారు? అనే సందేహం కలుగకమానదు.
ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకి కూర్చొన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ‘మన మట్టి-మన నీళ్ళు’, ‘మన ఇటుక మన రాజధాని’ వంటి కార్యక్రమాలు ప్రారంభించి ప్రజలందరి దృష్టిని తను చేప్పట్టిన అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంపైనే కేంద్రీకృతం అయ్యేలా చేయడంలో సఫలం అయ్యారు. ప్రజలు దసరా పండుగ వేడుకను కూడా మరిచి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంతో మమేకం అవ్వగలిగారంటే ఆయన ఎంత చాకచక్యంగా ప్రజల దృష్టిని మళ్ళించగలరో అర్ధమవుతుంది. మరి అంత నేర్పు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రత్యేక హోదా ఉద్యమాలతో తను, తన పార్టీ నేతలు చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ, దానిపై నుండి కూడా ప్రజల దృష్టిని వేరే అంశం మీదకు మళ్ళించకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అనే మరో సందేహం కలగవచ్చును. ఈ రెండు సందేహాలకి సమాధానంగా ఒక బలమయిన కారణం కనిపిస్తోంది.
తెదేపాకి మిత్రపక్షంగా, ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతూనే వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంది బీజేపీ. ఒకవేళ అదే జరిగితే తెదేపా భవిష్యత్ ప్రశ్నార్ధకం అవుతుంది. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకత ఉంటేనే అది అటువంటి ఆలోచనలు చేయడం మానుకొంటుంది. రాష్ట్రంలో బీజేపీకి అటువంటి వ్యతిరేక పరిస్థితి కల్పించి ఉంచాలంటే ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమాల వలన తనకు, తన పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటిని కొనసాగించనీయాలి.
ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు ఎన్ని ఉద్యమాలు చేసుకొన్నా వాటివలన తెదేపాకి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. ఒకవేళ ఉన్నా దానిని రాజధాని నిర్మాణం, మెట్రో రైల్ నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలతో అధిగమించగలరు. అందుకోసమే ఆయన కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నట్లు ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. కానీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి హామీలకు కేంద్రప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ బీజేపీ తెదేపాతో తెగ తెంపులు చేసుకొన్నా దాని కోసమే పోరాడుతున్న వైకాపాతో జత కట్టడం కూడా సాధ్యం కాదు. పోనీ రాష్ర్టంలో ఒంటరిగా పోటీ చేయాలనుకొంటే హామీలు నిలబెట్టుకోనందుకు ప్రజలలో దానిపట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంటుంది కనుక ఒంటరిగా పోటీ చేయలేదు. అంటే బీజేపీకి తెదేపాతో తన స్నేహం కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదన్నమాట!
బహుశః అందుకే ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాల వలన చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తున్నా చంద్రబాబు నాయుడు చాలా ఓపికగా అవన్నీ భరిస్తున్నారని భావించవచ్చును. లేకుంటే ఈ ప్రత్యేక హోదా అంశం మీద నుంచి ప్రజల దృష్టిని వేరే అంశం మీదకు ఎప్పుడో మళ్ళించి ఉండేవారేమో?