చంద్రబాబు నాయుడు… అంటే విదేశాల్లో చాలా మోజు ఉందని చెప్పుకుంటూ ఉంటారు! అందుకే, ఆయన ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా అంతర్జాతీయ సంస్థలను ఆంధ్రాకి తీసుకురాగలరని అంటుంటారు. ఆధునిక హైదరాబాద్‌ను ఆయనే నిర్మించారని ఇప్పటికీ చెప్పుకుంటారు! సరే, ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కాబట్టీ…ఆంధ్రాలోని విశాఖను అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పంతో ఉన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ కార్డ్ కంపెనీ టెక్నికల్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని కోరారు. వైజాగ్‌కి ఉన్న ప్రత్యేకతల గురించి మాస్టర్ కార్డ్ సంస్థ నిపుణులకు వివరించారు. మాస్టర్ కార్డ్ కేంద్రానికి వైజాగ్ చాలా అనువైన ప్రాంతమని సూచించారు.
ఆంధ్రాకి పెట్టుబడులు ఆకర్షించడంలో అంతర్జాతీయ వేదికపై చంద్రబాబు చేస్తున్న కృషి మెచ్చుకోవాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ఏపీ అభివృద్ధి విషయంలో విదేశాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, స్వదేశంలో ఎందుకు ఉండటం లేదన్నదే అసలు ప్రశ్న! ఇప్పుడు విశాఖ విషయమే తీసుకుంటే… మాస్టర్ కార్డ్ సంస్థ రావాలని ఎంతో కృషి చేస్తున్నారు. అదే కమిట్మెంట్ విశాఖ రైల్వేజోన్ విషయంలో చంద్రబాబుకు ఎందుకు ఉండటం లేదు? పైగా, కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు కూడా ఆంధ్రా నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు ఆంధ్రాలో అవకాశం ఇస్తే… రైల్వేశాఖాపరంగా ఆంధ్రాకి చాలా మేలు జరుగుతుందని గతంలో చంద్రబాబే చెప్పారు! ఇప్పుడా విషయమే చంద్రబాబు మరచిపోయినట్టున్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. సురేష్ ప్రభు కూడా మరచిపోయే ఉంటార్లెండి.
ఇక, ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో చంద్రబాబు సర్కారుది అట్టర్ ఫ్లాప్ షో! ఇప్పటికీ కేంద్రం ఏపీకి కల్పించాల్సిన ప్రయోజనాలపై చంద్రబాబు గట్టిగా మాట్లాడటం లేదు. ఆంధ్రా అభివృద్ధి గురించి ఆయన పాటు పడాలీ అంటే… స్వదేశంలో ఒకతీరు చొరవా… విదేశాలకు వెళ్లేసరికి ఇంకో రీతి చొరవ చూపితే ఏమనుకోవాలి..? ఒక ప్రైవేటు కంపెనీ రాకకోసం ఇంతగా పాకులాడుతున్నారే… కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ హక్కులూ కేటాయింపుల విషయంలో ఎందుకు కృషి చేయలేకపోతున్నారు? ఒకవేళ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లాంటివి విదేశాల నుంచి తెచ్చుకునే వీలుంటే ఈపాటికే చంద్రబాబు తెచ్చేసేవారేమో..!