కేంద్రం ప్రభుత్వం తీరుపై నిరసనగా ఆంధ్రాలో జరిగిన బంద్ జరిగింది. వామపక్షాలుతోపాటు ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా బంద్ లో పాల్గొంది. అధికార పార్టీ తెలుగుదేశం కూడా నేరుగా బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా ప్రకటించకపోయినా… ఢిల్లీలో తమ పార్టీ ఎంపీలు చేస్తున్న నిరసనలకు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు. మిత్రపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఏకమైనా, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నా, నాలుగు రోజులుగా ఎంపీలు ఆందోళన చేస్తున్నా… కేంద్రానికి కనీసం చీమకుట్టినట్టైనా అనిపించలేదు. ఆంధ్రాకి అన్నీ ఇచ్చేశామంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, ఏపీ ఎంపీలతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తూ వస్తున్నది ఇలాంటి ప్రకటనల కోసమా అంటూ ఆవేదన చెందారు. ఇకపై వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదనీ, పోరాటం కానసాగించాల్సిందే అని సీఎం చెప్పారు. ఆంధ్రాకి సాయం అడిగితే.. కేంద్రం దగ్గర నిధుల్లేవని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు ఇలాంటి లెక్కలు ఎందుకు మాట్లాడలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీలు నెరవేర్చండని అడుగుతుంటే.. ఇలా లెక్కలు చెప్పడమేంటంటూ తప్పుబట్టారు. కేంద్రం స్పందనలో ఏమాత్రం కొత్తదనం లేదనీ, ఇకపై పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి ఆయన తిరిగి వచ్చిన వెంటనే.. మలిదశ పోరాటానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఎంపీలు అంటున్నారు.
కేంద్రంతో పోరాటం కొనసాగుతుందీ అంటే… భాజపాతో పొత్తు కొనసాగదనే స్పష్టత వస్తున్నట్టుగానే ఉంది! తెలుగుదేశంతో పొత్తు తెంచుకునే దిశగానే భాజపా వైఖరి ఉంది. ఒకవేళ కొనసాగించుకోవాలన్న ఉద్దేశమే ఉంటే… పరిస్థితిని శాంతపరచే విధంగా చర్యలుండాలి. కానీ, భాజపా నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. టీడీపీతో పొత్తు ఉంటే ఎంత, పోతే ఎంత అన్నట్టుగానే ఉంది. ఇక, టీడీపీ కోణం నుంచి చూసుకున్నా.. భాజపాతో పొత్తు కొనసాగుతుందనే సంకేతాలు కనిపించడం లేదు. అలాంటి ఉద్దేశం టీడీపీకి ఉన్నా కూడా రాష్ట్రంలో విమర్శలపాలు కావాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి వచ్చాక మలిదశ పోరాటం ఖరారు చేస్తామన్నారు. అంటే, పొత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నాకనే పోరాటం కొనసాగుతుంది. మలిదశలో మంత్రులు కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకి రావడం.. ఎంపీల రాజీనామాల వరకూ వెళ్లే అవకాశం ఉంది.