ఎపిలో కలిపిన గ్రామాలను తిరిగి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండవ సారి ప్రకటించారు. ఎపి నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అలాటిది లేదని ఖండించారు. తెలంగాణ తలపెట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎపి ప్రయోజనాలకు హానికరమని కూడా ధ్వజమెత్తారు. అయితే అదే రోజున ప్రకాశం జిల్లాలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గ్రామాల విలీనం విషయమై నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం. కెసిఆర్ ఒకటికి రెండు సార్లు చెప్పిన మాట నిజమా కాదా? తనే మాట ఇచ్చి వెనక్కుపోతున్నారా? అందుకే ఖండించడానికి సంకోచిస్తున్నారా? అని సందేహం వస్తుంది.
ఓటుకు నోటు కల్లోలం తర్వాత చంద్రబాబు కెసిఆర్ ముందు మెత్తబడిపోయారని కాంగ్రెస్, వైసీపీలు ఆరోపించాయి. ఇప్పుడు అవతలివారు ఒకటికి రెండుసార్లు అదే మాట చెబుతున్నా ఔను కాదు అనకుండా తప్పించుకోవడం సందేహాలు పెంచుతుంది. నీటి ప్రాజెక్టుల విషయంలోనూ దేవినేని తీవ్రంగా మాట్లాడితే చంద్రబాబు సుతిమెత్తగా ప్రతిస్పందించారు. ఇద్దరు సిఎంలు తామే స్నేహపూర్వక చర్చలకు పిలుపులిస్తున్నామని ఒకటికి రెండుసార్లు ప్రకటించుకోవడం బాగానే వుంది. మరి ఆ సమయం చూసుకుని కూచుని మాట్లాడుకుంటే ప్రజలకు చాలా భారం బాధలు తప్పుతాయి కదా!