యువ హీరో సందీప్ కిషన్ ఓసారి చిరంజీవితో చివాట్లు తిన్నాడు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు లెండి. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా నాటి ముచ్చట. అప్పటికి సందీప్ ఇంకా హీరో కాలేదు. చిరంజీవి పై అభిమానం కొద్దీ ఆయన్ని ఓసారి చూడాలనిపించిందట. ఆ సినిమాకి పనిచేసిన చోటా కె.నాయుడు సందీప్ కి మేనమామ కదా.. అందుకే ఆయన్ని పట్టుకొని చిరుని చూడ్డానికి వెళ్లిపోయాడు. అక్కడే చిరు తిట్టు తిన్నాడు.
అయితే దానికీ ఓ కారణం ఉంది లెండి. సెట్లో చిరంజీవిపై సీన్ తీస్తుంటే.. సరిగ్గా చిరుకి ఎదురుగా నిలబడి.. గుడ్లు మిటకరించి మరీ చిరునిచూస్తూ నిలబడ్డాడట సందీప్. దాంతో చిరంజీవి కాన్సట్రేషన్ చేయలేక.. డైలాగులు మర్చిపోయేవాడట. ఒకట్రెండు సార్లు అదే పునరావృతమైతే.. ఇక చిరు కంట్రోల్ తప్పి.. ‘పక్కకు వెళ్లు’ అని గట్టిగా కసిరాడట. దాంతో సందీప్ పక్కకెళ్లిపోయాడట. ఆ తరవాత సందీప్‌ని పిలిచి.. ‘ఏమీ అనుకోకు..’అని సర్దిచెప్పాడట చిరు. ఈ విషయాన్ని సందీప్ కిషనే స్వయంగా గుర్తు చేసుకొన్నాడు. చిరు తిట్టినా సూపరే..అంటూ తన అభిమానాన్ని చాటుకొంటున్నాడు సందీప్.