ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలు బస్సుయాత్రలకు సిద్ధమయ్యాయి. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ ఈ యాత్రలు చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. సోమవారం.. బీజేపీ బస్సుయాత్రను… అమిత్ షా ప్రారంభించబోతున్నారు. దీని కోసం భారతీయ జనతా పార్టీ రేంజ్లో బస్సు సిద్దమయింది. కనీసం రూ. మూడు కోట్ల ఖర్చుతో బస్సును సిద్ధం చేశారు. 15 రోజుల్లో 85 నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. కర్నూలు జిల్లా ఆదోని ముగిస్తారు. బస్సు యాత్ర ఒక్కో జిల్లాలో ఉన్నప్పుడు .. ఒక్కో కేంద్రమంత్రి వస్తారట. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా.. అదే ప్లాన్‌లో ఉంది. హోదా భరోసా యాత్ర పేరుతో అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు యాత్ర ప్రారంభించబోతున్నారు. 84 అసెంబ్లీ నియోజకవర్గాలను, 25 పార్లమెంట్ స్థానాలను కవర్ చేసుకునేలా యాత్ర చేస్తారు..!. కాంగ్రెస్ నేతలు కూడా.. ఢిల్లీ స్థాయి నేతల్ని రంగంలోకి దించబోతున్నారు.
జాతీయ పార్టీలు రెండూ.. ప్రజల్లోకి వెళ్లడానికి బస్సుయాత్రల్నే ఎంచుకున్నాయి..? మరి ప్రజల్లోకి వెళ్లి ఏం చెబుతాయి..?. ఇప్పుడు ఇష్యూ భారతీయ జనతా పార్టీ కాబట్టి.. ప్రజల్లోకి వెళ్లి బీజేపీ నేతలు ఏం చెబుతారు..? తాము ఏపీకి ఏమిచ్చామో చెబుతారా..? ఏమిచ్చామని చెబుతారు..? లక్షల కోట్లు ఇచ్చేశామని నోటిమాటగా చెప్పి.. చంద్రబాబు నొక్కేశారని… ఆరోపించేస్తే పనైపోతుందా..?. ప్రజలు సూటిగా అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పాలి కదా..!?. హోదా నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ వరకూ.. ఏమీ ఇవ్వలేదని.. కళ్ల ముందు కనబడుతున్న వాటి గురించి చెబుతారా..? కనీసం వాటి ప్రస్తావన అయినా తీసుకు రాగలరా..?. పోనీ బీజేపీకి ఆదరణ ఉందని నిరూపించుకునేందుకు ఒక్కరంటే.. ఒక్కరైనా జనాకర్షక నేత ఉన్నారా..?. ఈ విషయంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందన్న అడ్వాంటేజ్‌ను వాడేసుకుని.. ఏదో చేద్దామని తాపత్రయ పడుతుంది కానీ.. ప్రజల్ని కన్విన్స్ చేసేంత మెటీరియల్ సమకూర్చుకోలేదు. అది సాధ్యం కాదు కూడా. ఎన్నికల సమయంలో… బీజేపీకి ఈ బస్సుయాత్ర ఓ సవాల్ లాంటిదే.
ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకుంటుంది..? ప్రత్యేకహోదా భరోసా యాత్ర అంటూ.. వస్తే ప్రజలు పట్టించుకుంటారా..? అసలు హోదా కోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చి పెట్టింది కాంగ్రెస్ కాదా..? విభజన చిక్కులు తెచ్చి పెట్టి.. ఇప్పుడు… కాపాడతాం అంటూ వస్తే ప్రజలు నమ్ముతారా..?. అటు కాంగ్రెస్‌కు కానీ.. ఇటు బీజేపీకి కానీ.. బస్సుయాత్రల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ.. వారు చేసిన గాయాలు మాత్రం ప్రజలకు మళ్లీ గుర్తుకు రావడానికి అవకాశం మాత్రం ఏర్పడుతుంది. అంటే.. వీరి యాత్రలు.. ఇతర పార్టీలకు ఉపయోగపడటమే కానీ.. వారికి మాత్రం ఓట్లు తెచ్చి పెట్టే అవకాశం లేదు.