వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ ఇంట్లో అటెండర్ గా పని చేస్తారని సజ్జల ప్రకటించిన నవీన్ అనే యువకుడ్ని, సీఎం ఓఎస్డీగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు కడపలో ఆరున్నర గంటల పాటు ప్రశ్నించారు. వారు బయటకు రాగానే వారి కోసం సీఎస్ జవహర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు ఎదుట ఎదురు చూస్తున్నారు. సీఎస్ అంటే చీఫ్ సెక్రటరీనే. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీనే. ఆయనే సీబీఐ ప్రశ్నించిన ఈ ఇద్దరి కోసం జైలు బయట ఎదురు చూస్తున్నారు. వారు బయటకు రాగానే నేరుగా వారిని తీసుకుని తిరుపతి ఎయిర్ పోర్టుకువెళ్లి అక్కడ్నుంచి తాడేపల్లికి తీసుకు వెళ్లారు.
కృష్ణమోహన్ రెడ్డి ని జగన్ సీఎం అయ్యాక ఓఎస్డీగా ప్రకటించారు.. కానీ ఆయన ఎప్పట్నుంచో జగన్ వెంట ఉంటున్నారు. ఇక నవీన్ జగన్ సతీమణి భారతి ఫోన్లను అటెండ్ చేస్తారని చెబుతున్నారు. వీరిద్దరూ వివేకా హత్య కేసులో ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీబీఐ విచారణకు పిలిస్తే సీఎస్ జవహర్ రెడ్డి ఎందుకంత కేర్ తీసుకున్నారన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ఉదయం ఆయనే వారిని కడపకు తీసుకు వచ్చి ఉంటారని.. వెళ్లేటప్పుడు తీసుకెళ్లారని అంటున్నారు. సీఎస్ ఇంత ఖాళీగా ఉన్నారా అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది.
వివేకా హత్య కేసు విచారణ అనేది ప్రభుత్వానికి సంబంధం లేని అంశం. అదో ఘోరమైన నేరం. ఆ నేరంలో పాలు పంచుకున్న వారికి ఎవరికైనా ఇలా ప్రభుత్వ పరంగా సాయం అందిందంటే.. క్షమించరాని నేరం చేసినట్లే్. కానీ విచిత్రంగా వివేకా హత్య కేసు విషయంలో ప్రభుత్వ అధికారులు అన్ని గీతలు దాటేస్తున్నారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేస్తున్నారో కానీ.. సివిల్ సర్వీసు ట్రైనింగ్ లో ఇచ్చే విలువలు .. నేర్పే ఉద్యోగ నిజాయతీ మొత్తాన్ని వదిలేస్తున్నారు. చివరికి అటెండర్లను సీఎస్ పికప్ చేసుకుంటున్నారంటే.. ఇది ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో ?