దీక్ష చేస్తున్న వ్యక్తి వద్దకు స్వయంగా వెళ్లి.. ఆయన పక్కన కూర్చుని మాట్లాడితే తప్ప పరామర్శించినట్టు కాదా? ఆయన చేపడుతున్న దీక్ష మద్దతు తెలియజేయడం, సంఘీభావం తెలియజేయడం అంటే స్వయంగా తాము కూడా వెళ్లి దీక్షలో కూర్చోవడం మాత్రమే అవుతుందా? ఏమో ప్రస్తుతం ఏపీలో ముద్రగడ దీక్ష విషయంలో విపక్షాల నాయకుల తీరు మాత్రం ఇలాంటి అభిప్రాయాలనే కలిగిస్తోంది. పరామర్శ పేరిట, సంఘీభావం తెలియజేసే పేరిట… దీక్ష నాలుగో రోజుకు వచ్చిన తర్వాత.. కాపు వర్గానికి చెందిన వివిధ పార్టీల్లోని ప్రముఖులంతా కిర్లంపూడి వైపు పయనం కావడం సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడమూ, తదనుగుణంగాన ఉద్రిక్తతలు చెలరేగడమూ తప్ప సెలబ్రిటీలు వెళ్లడం వలన ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదని పలువురు భావిస్తున్నారు.
అయితే ఇక్కడ మరో కీలక విషయాన్ని గమనించాల్సి ఉంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకోసం తొలుత చేసిన గర్జన సభ దారుణమైన హింసకు దారితీసిన నేపథ్యంలో ఆయన ఉద్యమకారుడిగా రెండో దఫా దీక్ష చేపట్టినప్పుడు చాలా హెచ్చరికలు చేశారు. తనకు సంఘీభావం ప్రకటించడానికి గాని, మద్దతు తెలియజేయడానికి గానీ.. ఎవ్వరూ కిర్లంపూడి రావద్దు అంటూ ముద్రగడ విజ్ఞప్తి చేశారు. తనకు ఎవరు సంఘీభావం తెలియజేయదలచుకున్నా సరే.. వారి వారి ఇళ్లలోనే మధ్యాహ్న భోజనం మానేసి ఖాళీ పళ్లెం గరిటెలతో చప్పుడు చేస్తూ నిరసన తెలియజేయాలని ముద్రగడ కోరారు. నిజానికి కాపుల డిమాండ్కోసం తన దీక్షకు సంఘీభావం తెలియజేసేవాళ్లంతా తమ తమ ఇళ్లలోంచే ఇలాంటి పనిచేయాలనేది ఆయన కోరిక.
అయితే మాజీ కేంద్రమంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి, ఇంకా మాజీ రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి తదితరులంతా కిర్లంపూడి ‘వెళ్లి’ పరామర్శించడానికే మోజు పడడం విశేషం. ఇలాంటి సునిశితమైన సమయంలో తాము కూడా దీక్ష స్థలికి వెళ్లడం వలన పరిస్థితులు మరింత ఘోరంగా తయారవురతాయనే కనీస అవగాహన ఈ నాయకులకు ఉండదా? అని పలువురు అనుకుంటున్నారు. ముద్రగడ మీద వీరికి గౌరవమే ఉంటే గనుక.. తమ తమ ఇళ్లలోనే కూర్చుని ఓ పూట భోజనం మానేసి పళ్లెం గరిటెలతో చప్పుడు చేస్తూ సంఘీభావం చెప్పవచ్చు కదా.. అక్కడకు వెళ్లి అరెస్టు కావడం, పోలీసులు అడ్డుకునే పరిస్థితిని సృష్టించి.. ప్రభుత్వ వ్యతిరేకంగా రెచ్చిపోయే ప్రకటనలు చేయడం ఇవన్నీ అవసరమా? అని జనం అడుగుతున్నారు. పరిస్థితి ఏ క్షణమైన అదుపు తప్పి.. మళ్లీ హింసకు దారితీసే దుస్థితి ఏర్పడితే వీరంతా బాధ్యత వహిస్తారా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీక్ష కు సంఘీభావం అంటే ముద్రగడ చెప్పినట్లుగా చేయాలే తప్ప.. ఆయన వద్దకు వెళ్లి.. ఉద్రిక్తతల్ని పెంచడం కరెక్టు కాదని అనుకుంటున్నారు.