రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు టీడీపీ బేషరతు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కాస్త హడావుడి చేశారు. అయితే, ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా కేంద్రమంత్రి, ఏపీకి చెందిన భాజపా నాయకుడు ఎమ్. వెంకయ్య నాయుడు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లకుండా ఉంటారా.. అని ఎవ్వరూ అనుకోరు! ఎందుకంటే, ఆ ఇద్దరి స్నేహం అలాంటిది. చంద్రబాబుకు కేంద్రంతో ఏ అవసరం ఉన్నా వెంకయ్య నాయుడు ద్వారానే సంప్రదిస్తారని అందరికీ తెలిసిందే. అయితే, వెంకయ్యతో ఇంత దోస్తీ ఉంటే… నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎందుకు వెళ్లనట్టు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ఖరారు చేసిన వెంటనే.. సీఎం చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. అంతేకాదు, సోమవారం నాడు విజయవాడలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తాను వెళ్తున్నట్టు ప్రకటించారు. తాను ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందని క్యాబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే, అంతలోనే ఏమైందో ఏమో.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనూహ్యంగా రద్దయిపోయింది. ఇంతకీ, చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్లలేదనే అంశంపై ఇంకా ప్రభుత్వ వర్గాల నుంచీ ఎలాంటి క్లారిటీ రాలేదు. వెంకయ్య నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబుకు కేంద్రం ఆహ్వానం పలికిందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
కారణాలు ఏవైనా సరే… ప్రస్తుతం ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు ఇకపై వెంకయ్య నాయుడు దూరంగా ఉంటారు కాబట్టి, మిత్రుడు అయినా సరే చంద్రబాబు వంటి నాయకుల్ని ఆహ్వానించాల్సిన పనిలేదని భాజపా భావించి ఉంటుందని కొంతమంది అంటున్నారు. చంద్రబాబుకి ఆహ్వానం పంపకపోవడం అనేది భాజపా చేసిన అవమానంగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమానికి ఏపీ సీఎంను దూరం పెట్టారనీ, టీడీపీ భాజపాల మధ్య సంబంధాల బలమెంతో ఇలా బహిర్గతం అవుతోందని కూడా కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా, వెంకయ్య నామినేషన్ కార్యక్రమంపై టీడీపీ ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉందనే చెప్పాలి.