ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరూ అరెస్టయ్యారు. మనీష్ సిసోడియా కూడా అరెస్టయ్యారు. అరెస్టయిన ఎవరికీ బెయిల్ రావడం లేదు. కవిత స్కామ్ చేశారని లంచాలిచ్చారని.. వచ్చిన డబ్బులతో బినామీ భూములు కొన్నారని ఈడీ సాక్ష్యాలు కూడా కోర్టుకిచ్చింది. కానీ అరెస్టు గురించి మాత్రం ఆలోచన చేయడం లేదు. జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్లను బయట పెట్టినప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించిన కవిత.. తనపై నిర్దిష్టమైన అభియోగాలు నమోదు చే్తూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై మాత్రం స్పందించలేదు.
కవితను గతంలో ఈడీ కార్యాలయానికి పిలిచి నాలుగు సార్లు ప్రశ్నించారు. ఆమె కు చెందిన పది ఫోన్లను తీసుకున్నారు. తర్వాత మళ్లీ పిలుస్తామని నోటీసులు ఇచ్చారు కానీ పిలువలేదు. అందర్నీ అరెస్ట్ చేసి కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ మినహాయింపులో రాజకీయం ఉందన్న భావన అందుకే పెరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయడమే మిగిలింది అనుకున్న సమయంలో మొత్తం ఒక్క సారిగా చల్లబడిపోయింది.
మరో వైపు కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. మహారాష్ట్రలో మాత్రం అదీ కూడా శివారు ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇదంతా బీజేపీకి మేలు చేయడానికేనన్న ప్రచారమూ ప్రారంభమైంది. ఇదంతా బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి.. ప్రజల్లో బీఆర్ఎస్,బీజేపీ ఒకటే అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కారణం అవుతున్నాయన్న ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది.
కారణం ఏదైనా కేసీఆర్ బీజేపీపై దాడిని తగ్గించారు. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు స్లో కావడం.. మరో వైపు బీజేపీ కేసీఆర్ దాడిని తగ్గించడంతో బీజేపీ, బీఆర్ఎస్ రాజీ చేసుకున్నాయా అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇది తెలంగాణ బీజేపీపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.